Tag Archives: hitopadesam
కర్రల కట్ట
ఒక తండ్రికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఆ ఏడుగురూ ఎప్పుడూ దెబ్బలాడు కుంటూనే ఉండేవారు.
తండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూసాడు. కొడుకులకు సద్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి – అన్నీ చేసాడు – కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆప లేదు.
ఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధ పడ్డాడు.
కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. ఏడుగురూ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయ్యారు చేసారు.
తండ్రి ఒకొక్క కొడుకునీ ముందుకి పిలిచి ఆ కట్టని విరక్కోట్టమని ఆదేశించాడు. వంతులు వంతులు గా ఏడుగురూ ఆ కట్టను విరక్కోట్టడానికి ప్రయత్నం చేసారు, కానీ విరక్కొట్ట లేక పోయారు.
ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేసాక, ఎవరి కర్రను వాళ్ళు విరక్కొట్ట మన్నాడు. కొడుకులు సునాయాసంగా విరక్కోట్టేసారు.
అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు: “మీరందరూ ఈ కట్టలా కలిసి వుంటే మీరు బలంగా వుంటారు – మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ విడి విడిగా ఈ కర్రలలా వుంటే మట్టుకు మీకు యే బలము వుండదు.”
(Image in this story is a free Bing clip art tagged as “Creative Commons Licensing” – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
కొంగలు, తాబేలు
ఒక చెరువులో రెండు కొంగలు, ఒక తాబేలు ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు పడక పోవడం వల్ల చెరువులోని నీళ్ళు ఎండి పోయాయి.
కొంగలు రెండూ ఒక రోజు ఎగురుతుంటే ఒక కొత్త చెరువుని చూసాయి. అందులో నీళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టూరా పచ్చగా వుంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు, అలా నీళ్ళల్లో వుండే వేరే జీవులు వున్నాయి.
కొంగలు వుండే పాత చెరువు నుంచి పెట్టీ, బేడా సద్దుకుని, కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఈ విషయం చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వింది.
“మీ తో పాటు నన్నూ తీసుకుని వెళ్ళండి, నేను ఒక్కర్తిని ఇక్కడ ఉండలేను.” అని బ్రతిమాలింది.
కొంగలు జాలి పడి తాబేలుని తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నాయి. కాని ఎలా? తాబేలు ఎగర లేదు. అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళ లేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా. పోనీ మోసుకుని తీసుకెళ్ళి పోదామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు.
చివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలు ఒక కర్రను నోట్లో గట్టిగా పట్టుకుంటే, ఆ కర్రను తలోవైపు కొంగలో పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు. తాబేలుకి చాలా ఉత్తేజం కలిగింది.
“ఎట్టి పరిస్థితిలోను నువ్వు నోరు తెరవకూడదు, గట్టిగా నోటితో కర్రని పట్టుకునే వుండాలి!” అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది.
మొన్నాడు తెల్లారగానే అనుకున్న ప్రకారం కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి. తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది. కాని కొంచం సేపు ఎగిరాకా కింద భూమి మీద కొంత మంది పిల్లలు కనిపించారు.
పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి, ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని నోరు తెరిచింది.
ఇంకేముంది. ధమ్మన కింద పడిపోయింది. దాని గుల్ల పగిలిపోయి పాపం ప్రాణాలు కోలిపోయింది.
మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటి వారు, మన మంచికి ఏదైనా చెప్తే, అది మనం పరిగణలోకి తీసుకుని, సమయానుకూలంగా అనుసరించాలి.
Image: Ritu Jagya/Shutterstock, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.
కుందేలు, తాబేలు మధ్య పరుగు పందెం
ఒక రోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది.
“నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడి కైనా వెళ్ళ గలవా?” అని వెటకారం చేసింది. “నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది.
తాబేలు పరుగు పందెం ఆడ డానికి ఒప్పుకుంది.
నిర్ణయించిన రోజు కుందేలు, తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి. కుందేలు మహా ధైర్యంగా, గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. మన తాబేలు అనుకువగా, వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది.
కోతి ని పథక కర్త గా ఎంచుకున్నారు. కోతి “వన్, టూ, థ్రీ…” అనంగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్ లో రేగుకుంటూ సాగింది.
కొంచం దూరం పరిగేట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించ లేదు. అసలు తాబేలు నెగ్గే ప్రశక్తే లేదు – ఎందుకు కష్ట పడడం? నిద్రపోయి, లేచి, సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు, అనుకుంది. ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది.
కొంత సేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ, నిదానంగా, చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దేగ్గిరకి చేరుకుంది.
తాబేలు ముగింపు గీత దెగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది. తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కాని, కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి, పోటి నేగ్గేసింది.
చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగడ్తలతో అభినందించారు.
మన బలాన్ని ఎక్కువ, ఇతర్ల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు.
Image: Ritu Jagya/Shutterstock, used under license from Shutterstock.com. Please do not copy or reproduce
చీమ సహాయం
ఒక పక్షి చెరువులో నీళ్ళు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్ళల్లో పాడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళల్లో ఈద లేక కాళ్ళూ, చేతులు కొట్టుకుంటోంది.
జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దెగ్గిరగా పడేసింది.
చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు వొడ్డు మీదకు చేరే దాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. వొడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియ చేసింది.
రోజులు గడిచేయి. కాలా క్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది.
ఒక రోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దేగ్గిరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్నే ఉద్దేశం తో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది.
నొప్పితో మనిషి ఒకటే సారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలేక్కడో పది పోయింది.
మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది.
అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది.
మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు.
(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
విన్నవన్నీ నిజం కాదు
ఒక రోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దెగ్గిర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు.
ఇంట్లో ఖిడికి లోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని ఖిడికి లోపలకి తొంగి చూసింది.
అక్కడ పాపని తల్లి ఎత్తుకుని, భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు. చివరికి కొంచం విసుక్కుంటూ, “ఊరుకో పాపా, ఊరుకో – లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటుందే, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను! అది నిన్ను తినేస్తుంది!” అని తల్లి పాపని మందలించింది.
ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంత సేపు ఖిడికి బైట కూర్చుని ఎదురు చూస్తూనే వుంది.
కొంత సేపటికి పాప ఇంకా ఏడుపు ఆపక పొతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, “ఊరుకో పాప, ఊరుకో. తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను” అని బుజ్జగించడం మొదలెట్టింది.
ఈ మాట విన్న తోడేలు హడిలి పోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. పరుగో పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది.
మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి.
Image: Aga Es/Shutterstock, used under license from Shutterstock.com. Image has been modified to add mother/child silhouette in window to illustrate this story. Please do not copy or reproduce.
పిల్లికి గంట ఎవరు కడతారు?
ఒక అడివిలో ఎలుకల్లన్నీ విసుకెత్తిపోయి వున్నాయి. పిల్లి వచ్చి రోజు వాటిని తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది. రోజుకొక ఎలకని తినేస్తోంది. అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. ముఖ్య విషయం: పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలా?
ఒక ఎలుక సభ వేదిక మీదకి ఎక్కింది. ఎలుకలకు వేదిక అంటే ఏముంటుంది – పక్కన ఉన్న ఒక బండ ఎక్కి, మిగితా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది.
“పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా వుంటుంది? పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో ఇట్టే పిల్లి వస్తున్నట్టు తెలిసిపోతుంది! అప్పుడు ఎలుకలన్నీ వెంటనే దాక్కోవచ్చు. కొన్ని రోజులకి ఆహారం లేక పిల్లి ఎటైన వెళ్ళిపోతుంది” అని వేదిక మీంచి ఎలుక సలహా ఇచ్చింది.
ఈ ఐడియా అందరికి చాలా నచ్చింది. వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి. గంట ఎలా వుండాలి, ఎక్కడ దొరుకుతుంది, యెంత పెద్ద దైతే బాగుంటుంది, యెంత దూరం నుంచి వినిపిస్తుంది, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాయి.
ఇంతట్లో ఒక ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది. “పిల్లికి గంట ఎవరు కడతారు?” అని అడిగింది.
పిన్ డ్రాప్ సైలెన్స్. ఎలుకలన్నీ చడీ చప్పుడు చేయకుండా నిశబ్దంగా ఒకరి ఒంక ఒకరు చూసుకున్నారు. పిల్లికి గంట ఎవరు కదతారన్న ప్రశ్న కు సమాధానం ఎవ్వరికి తట్టలేదు.
సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లి పోయారు.
ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ అన్ని సలహాలు పాఠింప దగ్గవి కాదు.
(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
జింక కొమ్ములు
ఒక రోజు ఒక మగ జింక చెరువులో నీళ్ళు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడై పోయాడు.
నా కొమ్ములు యెంత అందంగా వున్నాయి, నా తలపై కిరీటంలా వున్నాయి, అనుకుంటూ చాలా సేపు చూసుకున్నాడు.
చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబం లో కనిపించాయి.
“ఛీ! ఇంత అందంగా వున్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు!” అని తన కాళ్ళను తనే అసహ్యించుకున్నాడు.
కొంత సేపు అయ్యాక చెరువు దేగ్గిరకి నీళ్ళు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది.
భయంతో పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోయాడు.
అప్పుడు ఆ మగ జింకకి అర్ధం అయ్యింది. అందంగా వున్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని.
మనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి.
(Image in this story is a composite created with Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
కొంగ కోరికలు
ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.
ఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.
చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.
అలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.
మధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.
క్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.
ఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.
ఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.
(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
అహంభావి మేకలు
రెండు మేకలు, ఎవరి దారిన వారు వెళ్తూ ఒక కాలవకు ఇరువైపూ చేరాయి.
కాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అందులో చాలా రాళ్ళూ, రప్పలు వున్నాయి. అందులోంచి ఈదుకుంటూ అవతల వడ్డుకి చేరడం కష్టం.
కాలవపై ఎవరో మనుషులు ఒక చక్క ముక్క అడ్డంగా వేసారు. అదే ఆ కాలవపై వంతెన అన్న మాట. వంతెన సన్నంగా, ఇరుకుగా వుంది. ఒక సమయంలో ఒక మేక దాట డానికే స్థానం వుంది. రెండు ఉడతలు కూడా ఒకటిని ఒకటి దాటలేక జారిపోతాయేమో అని భయం వేసే అంత సన్నంగా వుంది.
రెండు మేకలూ ఒకటే సారి వంతెన మీదకి అడుగు పెట్టాయి. ఒకరిని ఒకరు చూసుకున్నాయి కాని, అహంభావంతో దేనికి వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి.
ముందు నేను ఎక్కాను, నువ్వు వెనక్కి వెళ్ళూ, అంటే ముందు నేను ఎక్కాను నువ్వే వెనక్కి వెళ్ళూ అంటూ రెండూ ఘర్షణ పడ్డాయి.
కొట్టుకోవడం మొదలెట్టాయి.
ఇంకేముంది. రెండూ కాలవలో పడి కొట్టుకు పోయాయి.
ఒక్కొక్క సారి మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే మనకు మంచిది.
Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce
గుంటనక్కకు గుణపాఠం

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from shutterstock.com.
ఒక రోజు ఒక అడవిలో రెండు గొర్రెపోతులు ఏదో కారణంగా కొట్టుకుంటున్నాయి. ఆ కారణం ఏమిటో ఎవ్వరికీ తెలీదు.
ఒకరిని ఒకరు కొమ్ములతో కుమ్ముతున్నాయి. చాలా తీవ్రంగా పోట్లాడుకుంటున్న గొర్రెపోతులకు బాగా దెబ్బలు తగిలాయి. గాయాలలోంచి రక్తం కారడం మొదలైంది. రక్తపు చుక్కలు నేలమీదకి కారుతున్నా పట్టించుకోకుండా గొర్రెపోతులు దెబ్బలాడుతూనే వున్నాయి.
ఇంతలో అటువైపు ఒక గుంటనక్క వచ్చింది. రక్తం వాసన తగిలి విషయం చూద్దామని ఆగింది. దెబ్బలాడుతున్న గొర్రెపోతులు, కారుతున్న రక్తం చూసింది. నేల మీద పడ్డ రక్తం నాకడం మొదలెట్టింది.
నాకుతూ, నాకుతూ, చూసుకో కుండా గొర్రెపోతుల మధ్యలో తల పెట్టింది.
గొర్రెపోతులూ చూసుకోలేదు. వాటి గొడవలో అవి నిమగ్నమై కొమ్ములతో గుంట నక్కని కుమ్మేసాయి. ఇంకేముంది? గుంట నక్కకి బాగా గాయాలు తగిలాయి. ఎలాగో గొర్రెపోతుల మధ్యలోంచి బైట పడి, ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి పారిపోయింది.
ఇద్దరు దెబ్బలాడు కుంటుంటే ఏదో మనకి లాభం ఉంటుందేమో అని మధ్యలో మూడో వాళ్ళు తల దూర్చడం అవివేకమే కదా! అదే గుంటనక్కకి గుణపాఠం!
వ్యాఖ్యలు