Tag Archives: simple stories
జింక కొమ్ములు
ఒక రోజు ఒక మగ జింక చెరువులో నీళ్ళు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడై పోయాడు.
నా కొమ్ములు యెంత అందంగా వున్నాయి, నా తలపై కిరీటంలా వున్నాయి, అనుకుంటూ చాలా సేపు చూసుకున్నాడు.
చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబం లో కనిపించాయి.
“ఛీ! ఇంత అందంగా వున్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు!” అని తన కాళ్ళను తనే అసహ్యించుకున్నాడు.
కొంత సేపు అయ్యాక చెరువు దేగ్గిరకి నీళ్ళు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది.
భయంతో పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోయాడు.
అప్పుడు ఆ మగ జింకకి అర్ధం అయ్యింది. అందంగా వున్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని.
మనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి.
(Image in this story is a composite created with Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
కొంగ కోరికలు
ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.
ఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.
చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.
అలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.
మధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.
క్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.
ఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.
ఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.
(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
గుంటనక్కకు గుణపాఠం

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from shutterstock.com.
ఒక రోజు ఒక అడవిలో రెండు గొర్రెపోతులు ఏదో కారణంగా కొట్టుకుంటున్నాయి. ఆ కారణం ఏమిటో ఎవ్వరికీ తెలీదు.
ఒకరిని ఒకరు కొమ్ములతో కుమ్ముతున్నాయి. చాలా తీవ్రంగా పోట్లాడుకుంటున్న గొర్రెపోతులకు బాగా దెబ్బలు తగిలాయి. గాయాలలోంచి రక్తం కారడం మొదలైంది. రక్తపు చుక్కలు నేలమీదకి కారుతున్నా పట్టించుకోకుండా గొర్రెపోతులు దెబ్బలాడుతూనే వున్నాయి.
ఇంతలో అటువైపు ఒక గుంటనక్క వచ్చింది. రక్తం వాసన తగిలి విషయం చూద్దామని ఆగింది. దెబ్బలాడుతున్న గొర్రెపోతులు, కారుతున్న రక్తం చూసింది. నేల మీద పడ్డ రక్తం నాకడం మొదలెట్టింది.
నాకుతూ, నాకుతూ, చూసుకో కుండా గొర్రెపోతుల మధ్యలో తల పెట్టింది.
గొర్రెపోతులూ చూసుకోలేదు. వాటి గొడవలో అవి నిమగ్నమై కొమ్ములతో గుంట నక్కని కుమ్మేసాయి. ఇంకేముంది? గుంట నక్కకి బాగా గాయాలు తగిలాయి. ఎలాగో గొర్రెపోతుల మధ్యలోంచి బైట పడి, ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి పారిపోయింది.
ఇద్దరు దెబ్బలాడు కుంటుంటే ఏదో మనకి లాభం ఉంటుందేమో అని మధ్యలో మూడో వాళ్ళు తల దూర్చడం అవివేకమే కదా! అదే గుంటనక్కకి గుణపాఠం!
సికమోర చెట్టు
ఇద్దరు మిత్రుల ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వుంది. ఉక్క పోస్తోంది. ఇద్దరు మిట మధ్యాన్నం ఎండలో బాగా అలిసిపోయారు.
కొంత సేపు అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు.
దారిలో ఒక సికామోర చెట్టు (అశ్వత్ధ వృక్షము) కనిపించింది. ఆ చెట్టు విశాలంగా వుంది. పెద్ద పెద్ద శాఖలు, వాటికి ఒత్తుగా ఆకులు, ఆ చేట్టుకింద మంచి నీడ. ఎండ లోంచి ఆ చెట్టు నీడలోకి రాగాని హాయిగా, చల్లగా, ప్రశాంతంగా అనిపించింది.
ఇద్దరు మిత్రులు చెట్టుకింద ఒక దుప్పటి వేసుకుని వారితో తెచ్చుకున్న భోజనం తిని, కాస్సేపు హాయిగా కునుకు పాట్లు పట్టారు. సాయంత్రానికి కొంచం ఎండ తగ్గి చల్లారాక, వారి దారిని బయలుద్యారుతూ, “ఈ చెట్టుకి అస్సలు పూలు కాని, పళ్ళు కాని ఏమి లేవు. అసలు ఇలాంటి చెట్టు దేనికి పనికొస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోయారు.
ఇది విన్న చెట్టు బాధ పడింది. ఇంత సేపు ఆశ్రయము, నీడని ఇచ్చి, తన ఆకులతో గాలి అందించినా ఆ ఇద్దరికీ కృతజ్ఞత లేదు అనుకుంది చెట్టు.
మనకి మేలు చేసిన వారిని మెచ్చుకో గలగడం కూడా ఒక గుణం. అది అందరిలో వుండదు.
(Image in this story is a composite created with Bing clip art marked “Creative Commons Licensing” and one image from Ritu Jagya/ ShutterStock.com – any copyright violations are unintentional and image will be removed if you let me know.)
ఎద్దు కొమ్ముపై ఈగ
ఒక ఎద్దు మైదానంలో గడ్డి మేస్తోంది. పచ్చని గడ్డి తింటూ, తన పని తను చేసుకుంటూ, యే ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా వుంది.
ఇలా హాయిగా వున్న ఎద్దు చుట్టూ కాస్సేపటికి ఒక ఈగ ముసరడం మొదలెట్టింది. ఎద్దు కొమ్ములపై వాలింది.
కొంతసేపటికి అలసట తీరాక ఈగ తన దారిని తను వెళ్తూ ఎద్దుతో, “ఇప్పుడు నేను బయలుద్యారుతున్నాను, నీ మీద వాలి అలసట తీర్చుకో నిచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు హాయిగా ఉందేమో” అంది.
ఎద్దు ఆశ్చర్యంగా ఈగవైపు చూస్తూ “అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే నాకు తెలీదు” అంది.
కొంతమంది వాళ్ళని వాళ్ళే చాలా గొప్ప అనుకుంటారు. కాని ఇతర్ల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాముఖ్యత వుండదు.
తుర్రుమన్న తోడేలు
అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబా గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది.
నొప్పి తో విలవిలలాడి పోయింది. గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించ లేము. అలాగే తోడేలు కూడా ఆ ఎముకను మింగలేక, కక్క లేక, బాగా బాధ పడింది.
కొంగను వెతుక్కుంటూ వెళ్ళింది. “నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది. అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను” అని ప్రమాణం చేసింది.
కొంగ బహుమానం మాట విని, ఆశ పడి, తన తల తోడేలు నోట్లో పెట్టి, పొడుగు పక్షి ముక్కుతో ఎముకని బైటికి లాగింది.
ఎముక బైట పడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలెట్టింది.
కొంగ తోడేలుని పిలిచి, “మరి నా బహుమానం యేది?” అని అడిగింది.
“నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కోరికేయకుండా నిన్ను మళ్ళి బయటికి తీసుకోనిచ్చాను. అదే నీ బహుమానం.” అని తోడేలు తుర్రుమంది.
దుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత వుండదు.
Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.
పుల్లని ద్రాక్షపళ్ళు
అనగనగా ఒక నక్క తన దారిన పోతూ ఒ తీగపై గుత్తులు గుత్తులగా నిగ నిగాలాడుతున్న ద్రాక్షపళ్ళు చూసింది.
వాటిని చూడగానే నక్కకి నోరు ఊరింది. సరదాగా కొన్ని తినదామని అనుకుంది. ద్రాక్షపళ్ళు అందుకుందామని చేతులు జాపింది, కాని గుత్తులున్న తీగ చాలా ఎత్తుగా వుంది. ద్రాక్షపళ్ళు అందలేదు.
ఒక్క సారిగా ఎత్తుగా గెంతి చూసింది. ఐనా అందలేదు. కొంచం దూరం నుంచి పరిగెత్తుకుంటూ దుంకి చూసింది. ఐనా అందలేదు.
ఇలా చాలా సేపు రకరకాలగా ప్రయత్నించింది. ఎన్ని విధాలగా చూసినా ద్రాక్ష పళ్ళు అందలేదు.
అలిసి పోయి నిరాశ తో నక్క, “ఏముంది ద్రాక్షల్లో? ఎలాగా పుల్లగా ఉండుంటాయి. అందుకే చెట్టుకి ఇంకా వేళ్ళాడుతున్నాయి” అనుకుంటూ వెళ్ళిపోయింది.
కొంత మందికి ఏమైనా దొరకకపోతే దాని గురించి అలుసుగా మాట్లాడడం అలవాటు.
Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce
తెలివి తక్కువ సింహం
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.
అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.
ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.
కోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”
సింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.
రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.
కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.
పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.
కుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.
కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.
అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.
కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.
సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.
కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.
బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.
Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce
బంగారు పళ్ళం
ఒక ఊరిలో సాహు, శీను, అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని రెండు భాగాలగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి, మధ్యాన్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటి పడక్కరలేదు.
ఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుదేసలో ఒక అవ్వ, ఆవిడ మనవరాలు ఉండే వారు. మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ – అంత డబ్బు పాపం అవ్వ దెగ్గిర లేదు.
“నా దెగ్గిర ఒక పాత పళ్ళం ఉంది, డానికి మసి పట్టుకుంది, కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా?” అని అవ్వ సాహుని అడిగింది.
సాహు పళ్ళం తీసుకుని చూసాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం! చాలా విలువైనది. సాహుకి దురాశ కలిగింది. “ఈ పళ్ళమా! ఇది దేనికి పనికొస్తుంది! పూర్తిగా మసి పట్టుకు పోయింది! దీనికి గాజులు రావు కాని, కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో!” అన్నాడు.
అవ్వ పాపం పళ్ళం తీసుకుని వెళ్లి పోయింది. సాహు మళ్ళీ మొన్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోక పొతే ఇంకొంచం ధర పెంచి తీసుకోవచ్చు, అనుకుని వెళ్ళిపోయాడు.
ఒప్పందం ప్రకారం మధ్యాన్నం అటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళం తీసుకుని గాజులివ్వమని అడిగింది. శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళం అని తెలుసుకున్నాడు. కానీ శీను మంచి వాడు. వెంటనే అవ్వతో, “ఇది బంగారు పళ్ళం అమ్మా! ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దేగ్గిరా లేదు. కాని మన సామంత రాజు దేగ్గిరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దెగ్గిర గాజులు కొనుక్కుని, మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు, నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు”, అని చెప్పాడు.
అవ్వ ఒప్పుకుంది.
విషయమంతా సామంత రాజుకి చెప్పారు. సామంత రాజు అవ్వ దెగ్గిర పళ్ళం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శీను నిజాయితిని మెచ్చుకుని, కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు.
ఇక సాహు సంగేంటంటే, ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి, అతని దెగ్గిర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్ట పడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేస్సాడు కాని కిట్టుబాటు కా లేదు. వ్యాపారం లో నష్టము వచ్చి, మరే ఉద్యోగమూ దొరకక, ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది.
ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగు పడరు.
Image: Veranika _Alferava/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce
పెద్ద అపాయం, చిన్న ఉపాయం
ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టిన ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటి లో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేది కాదు.
ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు, వారి భట్లతో డేరా వేసారూ.
మగ కాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ రాజకుమార్తె, తన చెలికర్తలు, నది వొడ్డున బట్టలు, నగలు పెట్టుకుని స్నానం చేస్తూ కనిపించారు.
అది చూసి కాకికి తన బద్ధ శత్రువైన పాము ని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకుని ఎగిరి పోయింది. అది గమనించిన భట్లు తమ ఆయుధాలతో వెంట పడ్డారు.
కాకి ఎగురు కుంటూ తన గూటికి చేరి, చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది.
హడావిడి ఏంటా అని చూడ డానికి పాము బయటికి వచ్చింది.
వెంట పడ్డ భటులు కింద పడున్న గొలుసు తెస్సుకోవడానికి వెళ్లి నప్పుడు ఆ పాము కనిపించింది.
పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు పాముని చంపేశారు. గొలుసు తీసుకుని రాజకుమార్తె కి తిరిగి ఇచ్చేసారు.
ఆ తరువాత కాకి జంట హాయిగా ఉన్నారు.
బలం కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలని కూడా చిన్న ఉపాయంతో తొలిగించవచ్చు.
Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.
వ్యాఖ్యలు