Tag Archives: telugu blog

గురుదక్షిణ – మాతృదక్షిణ

cover

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి వేళ, భీతగొలిపే ఈ స్మశానంలో, తల పెట్టిన కార్యం సాధించేందుకు, దృఢ సంకల్పంతో నువ్వు చేస్తున్న ధైర్య సాహసాలు మేచ్చుదగినవే. అయితే వాటితో పాటు మనిషికి లోకజ్ఞత, సమయస్ఫూర్తి, లక్ష్య శుద్ధి ఎంతో అవసరం. అవి లేనివాడు కార్యం సిద్ధించే తరుణంలో దాన్ని చేజేతులా జారవిడవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణంగా సునందుడనే వాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను” అంటూ ఇలా చెప్ప సాగాడు:

– పూర్వం విరూపదేశానికి బృహస్పతి లాంటి బుద్ధిశాలి అయిన మంత్రి వుండే వాడు. మహారాజు శూరసేనుడు ప్రతి విషయానికి మంత్రి మీదనే ఆధార పడేవాడు. ఆయన పాలనలో దేశం సుభిక్షంగా వుంది. దురదృష్టవశాత్తు మహామంత్రి అకాల మరణానికి గురయ్యాడు. శూరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకుని, ఆయన సలహాలతో రాజ్య పాలన చేయ సాగాడు.

Gurudakshina_1

 

కొత్త మంత్రికి రాజును మెప్పించడం బాగా తెలుసు కానీ, సలహాలివ్వడం బొత్తిగా చేత కాదు. అయినా తనకు తోచిన సలహాలిస్తూంటే రాజ్యపాలన అస్తవ్యస్తంగా సాగింది. కొందరు రాజుకీ విషయం చెబితే ఆయన అంగీకరించి, “మంత్రి సలహా తోనే రాజ్యం సుభీక్షంగా వుంది. మంత్రి అన్నవాడు తప్పుడు సలహాలివ్వలేదు. రాజ్యంలో ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం,” అన్నాడు.

చివరకు రాజగురువు కూడా శూరసేనుడిని, మంత్రి సలహాల గురించి హెచ్చరించాడు. రాజు నవ్వి, “గురువర్యా! తమకు దేవకార్యాల గురించి తెలిసినట్లు రాజకార్యాల గురించి తెలియదు. పాత మంత్రి సలహాలను కూడా ఆరంభంలో కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. కొత్త మంత్రి సలహాల గొప్పతనం, కొద్ది కాలంలోనే అందరూ అర్ధం చేసుకుంటారు” అన్నాడు.

Gurudakshina_2అందుకు రాజగురువు ఏమి అనలేక పాత మంత్రి ఇంటికి వెళ్ళాడు. పాత మంత్రి భార్య ఆయనకు నమస్కరించి ఉచితాసనం చూపించింది. రాజ గురువు ఆమెను ఆశీర్వదించి, “అమ్మాయీ! మహారాజు శూరసేనుడు, నీ భర్త వల్ల బాగా ప్రభావితుడైనాడు. కానీ నీ భర్త మంత్రి స్థానాన్ని ఇప్పుడొక మూర్ఖుడు ఆక్రమించాడు. వాడు తన తప్పుడు సలహాలతో దేశానికి హాని కలిగిస్తున్నాడు. మెచ్చుకోలు కబుర్లతో రాజుని మెప్పించి, తన స్థానం పటిష్థం చేసుకున్నాడు. కేవలం మంత్రి సలహాలపైనే ఆధార పడడం, ఏ రాజుకూ మంచిదికాదని శూరసేనుడు గ్రహించలేకపోతున్నాడు. ప్రస్తుతానికి మనం చేయగలిగిందేమీ లేదు. కాని నువ్వు దేశానికొక ఉపకారం చేయాలి. నీ కుమారుడు సునందుడికిప్పుడు పదేళ్ళ వయసు గదా! చండకారణ్యం లోని వితండుడి గురుకులాశ్రమానికి వాణ్ని పంపు. వితండుడు నీ కుమారుడిని విచక్షణ జ్ఞానం గల మహా మంత్రిగా తీర్చి దిద్దుతాడు. నీ కుమారుడు విద్య ముగించుకుని తిరిగి వచ్చేవరకూ, మన దేశానికి మోక్షం లేదు,” అన్నాడు.

పాత మంత్రి భార్య అందుకు సరేనని అలాగే చేసింది. పదేళ్ళ వయసులో సునందుడు, తల్లిని విడిచి చండకారణ్యం చేరుకున్నాడు.

Gurudakshina_3

అక్కడ వితండుడు, వాణ్ణి చూసి విషయమడిగి తెలుసుకుని, “గురుకులానికి జ్ఞాన సముపార్జన కోసం రావాలి. మంత్రి పదవిని ఆశించి రాకూడదు. అయినా నీకింకా పదవి గురించి ఆలోచించే వయసు రాలేదు.” అన్నాడు.

నునందుడు వితండుడికి నమస్కరించి, “గురువర్యా! నా తండ్రి మంచి సలహాలతో మహారాజుకు సాయ పడిన మాట నిజం. ఆ విధంగా దేశానికి ఉపకారం జరిగింది. కానీ నా తండ్రి కారణంగా రాజుకు మంత్రి సలహాలన్నీ మంచి సలహాలేనన్న దురభిప్రాయం కలిగింది. అది తొలగించాల్సిన భాద్యత నాది. సమర్థుడైన మంత్రి, రాజులో విచక్షణా జ్ఞానాన్ని పెంచుతాడు తప్ప, అన్నింటికీ తనపై ఆధారపడేలా చేయడు. నా తండ్రి చేసిన తప్పును సవరించడం కోసమే నేను తమ వద్దకు వచ్చాను.” అన్నాడు.

వితండుడు, సునందుణి దీవించి, “నీలో గొప్ప తెజస్సుంది. నీ మాటలు వయసుకు మించిన తెలివిని సూచిస్తున్నాయి. నిన్ను సకల శాస్త్ర పారంగాతుడిని చేసి, నా తర్వాత ఈ గురుకులాన్ని నీకి అప్పగించాలనిపిస్తోంది. అయితే, నీ అభిప్రాయం కూడా న్యాయమైనదే! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో! కేవలం ఉద్యోగం, పదవిని ఆశించి చదివేవాడు, జీవితంలో ఎందుకూ కొరగాకుండా పోతాడు.” అన్నాడు.

సునందుడు వినయంగా తలవంచి ఊరుకుని, ఆ రోజే విద్యాభ్యాసం ప్రారంభించాడు. వితండుడు వాడికి అన్నీ నేర్పుతూనే రాజరికం, మత్రంగాల గురించి కూడా వివరిస్తుండేవాడు. ఆ విధంగా మూడు సంవత్సరాలు గడిచేసరికి, వాడు తనకంటేముందు చేరినవారిని కూడా అధిగమించి గురుకులంలో ప్రథముడుగా నిలిచాడు.

ఒక రోజు వితండుడు శిష్యులు అందర్నీ సమావేశ పరించి, “మీ లో రమాకాంతుడు ఎందుకూ కోరగానివాడని గుర్తించాను. ఇన్నేళ్ళ నా శిక్షణ వాడి విషయంలో వృధా అయిందని నాకెంతో బాధగా వుంది. మీలో ఎవరైనా వాడి బాధ్యతను స్వీకరించి, వాడి మెదడులో రవ్వంత జ్ఞానాన్ని ప్రవేశించ పెట్టినా, నాకు సంతోషం. అలా చేసినవాడికి నా తదనంతరం గురుకులం అప్ప జెబుతాను.” అన్నాడు.

ఇది వింటూనే రమాకాంతుడు కోపంగా లేచి, “నా సాటి వారిచేత పాఠాలు చెప్పించుకునేందుకు నేనిక్కడికి రాలేదు. నలుగురి ముందూ నా గురువే నన్నిలా అవమానించాక, నాకిక్కడ పనేముంది?” అని వెళ్ళిపోయాడు.

అప్పుడు వితండుడు నిట్టూర్చి, “రమాకాంతుడికి మంత్రి కావాలన్న కొరిక బలంగా వుంది. అందువల్ల ఏ విద్య అబ్బలేదు.” అన్నాడు.

మరొక రెండు సంవత్సరాలకు సునందుడి విద్యాభ్యాసం పూర్తయ్యింది. వాడు వితండుడిని గురుదక్షిణగా ఏమి కావాలని అడిగాడు.

“నువ్వు నా గురుకులాన్ని నడుపుతానంటే అదే నాకు గురుదక్షిణ!” అన్నాడు వితండుడు.

“గురువర్యా! గురువుకంటే ప్రథమ స్థానం తల్లిదని సర్వ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మాతృదక్షిణను కాదని గురుదక్షిణ ఇమ్మని తమరాదేసిస్తే, అలాగే చేస్తాను!” అన్నాడు సునందుడు.

“పదిహేనేళ్ళ వయసుకే ఇంతవాడివయ్యావు. నీ జ్ఞానం ఒక రాజ భావనానికీ, నీ తెలివి ఒక రాజుకు పరిమితం కావడం ఇష్టం లేక అలా అన్నాను. నీ మనసుకు తోచిన పని ఏది చేస్తే, అదే నా గురు దక్షిణ. వెళ్లిరా నాయనా!” అన్నాడు.

Gurudakshina_4సునందుడు విరూపదేశారిగ వెళ్ళాడు. సూరసేనుడు ఇప్పుడు రాజ్యమేలడం లేదని, ఆయన అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల మూడు సంవత్సరాల నించి ఆయన కుమారుడు వీరసేనుడు రాజ్యమేలుతున్నాడని తెలుసుకున్నాడు.

వీరసేనుడు గొప్ప అహంకారి. అన్నీ తనకే తెలుసనుకుంటాడు.  తనకు సలహాలివ్వడానికి కాక, తను చెప్పింది అవుననడానికి మంత్రి కావాలి అతడికి! తన తండ్రి సూరసేనుడిని మెప్పించిన మంత్రి అనర్హుడని అంతా అనడం వల్ల, కొత్త మంత్రి కోసం ప్రకటన చేశాడు.

సునందుడు ఇల్లు చేరగానే తల్లి ఈ విషయాలన్నీ చెప్పి, “నువ్వు సరైన సమయానికి వచ్చావు. రేపే వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకోబోతున్నాడు. నువ్వాయనకు మంత్రివై, తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలి.” అన్నది.

దురదృష్టం కొద్ది ఆ రాత్రే సునండుడికి వొళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అప్పుడు రాజగురువు వచ్చి వాణ్ణి కలుసుకుని, “నాయనా! కొత్త మంత్రి ఎన్నిక అయిపొయింది. నీవు వచ్చినట్లు నాకు ఆలస్యంగా తెలిసింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నాతొ వస్తే రాజుకు నిన్ను పరిచయం చేస్తాను. నేను చెబితే ఇద్దరు మంత్రులను తీసుకునేందుకు రాజు వెనకాడడు. ప్రస్తుత పరిస్థితిలో దేశానికి నీ అవసరం ఎంతైనా వుంది.” అన్నాడు.

సునందుడు అందుకు అంగీకరించినా, ముందుగా కొత్త మంత్రిని కలుసుకుని మాట్లాడాలన్నాడు. రాజగురువు వాణ్ణి కొత్త మంత్రి వద్దకు తీసుకు వెళ్ళాడు. వితండుడు ఎందుకూ పనికి రానివాడని తీర్మానించిన రమాకాంతుడక్కడ వాడికి కొత్త మంత్రి వేషంలో దర్శనమిచ్చాడు.

ఇద్దరూ పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక, రాజగురువు రామాకంతుడికి తన మనసులోని మాట చెప్పాడు. అందుకు రమాకాంతుడు ఎంతో సంతోషించి, “మనమిద్దరం కలిసి మంత్రులుగా ఒకే రాజు వద్ద పనిజేయడం, నా అదృష్టంగా భావిస్తాను.” అన్నాడు.

 

Gurudakshina_5సునందుడు మాత్రం రామాకాంతుడి భుజం తట్టి, “నేను నిన్ను అభినందించాలని వచ్చాను. గురువుగారు గురుకులం బాధ్యతా తీసుకుంటే, అదే నా గురుదక్షిణ అన్నారు. ఆయన మాట కాదనలేను. నేనిప్పుడు చండకారణ్యానికి వెళుతున్నాను.” అని ఇంటికిపోయి, తల్లిని వెంటబెట్టుకుని చండకారణ్యం లోని గురుకులానికి బయలుదేరాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, గురుదక్షిణకంటే, మాతృదక్షిణ ముఖ్యమని రాజ్యానికి తిరిగి వచ్చి మంత్రి కాదలచిన సునందుడు, మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని కాదలచిన సునందుడు, మనసెందుకు మార్చుకున్నాడు? వీరసేనుడు కొత్త మంత్రిని ఎన్నుకునే రోజునే తనకు జ్వరం వచ్చి ఇల్లు కదలలేకపోవడం దైవ సంకల్పం అనుకున్నాడా? అలా కాక, రామాకాంతుడి వంటి పనికిమాలిన వాడితో కలిసి పని చేయడం అవమానంగా భావించాడా? అన్నిటినీ మించి, అలాంటి అసమర్థుడు మంత్రిగా ఉన్నప్పుడే రాజుకు తనబోటివాడి అవసరం అతిముఖ్యమని ఎందుకు గ్రహించలేక పోయాడు? వితండుడి వంటి ఉద్దండ పండితుడి వద్ద శిక్షణ పొందినా సునందుడిలో లోకజ్ఞానం, సమయ స్ఫూర్తి, లక్ష్యశుద్దీ లోపించడానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “తన విద్యా, తెలివితేటలూ ఒక రాజుకు పరిమితం చేయకుండా, ఎందరికో ఉపయోగపడేలా చేయమని గురువు చెప్పినా వినకుండా, సునందుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అందుకు కారణం వాడికి తల్లీ, రాజగురువుల పట్ల గల భక్తీ గౌరవాలు. అయితే, కొత్త రాజు వీరసేనుడు మంత్రిని ఎన్నుకున్న తీరు వాడిని ఆశ్చర్య పరచాడమేగాక, ఆలోచించేలా చేసింది. వీరసేనుడు ఆహంకారే కావచ్చు, కాని తెలివైనవాడు. ఆయన తెలివితక్కువ వాడైతే, మంత్రి తెలివైనవాడైనా తెలివి వృధా. సునందుడు తెలివైనవాడు కాబట్టి తన సలహాలతో రాజుకు సాయపడగలడు. అయితే రాజు తన తెలివి అంటా వెచ్చించి రామాకాంతుడిని మంత్రిగా ఎన్నుకున్నాడు. ఒక తెలివైనవాడు రామాకాంతుడి లాంటి వాణ్ణి మంత్రిగా ఎన్నుకున్నాడాంటే అర్ధమేమిటి? ఆయన దృష్టిలో మంత్రి పదవికి ఏమాత్రమూ విలువు లేదన్న మాట. అది కేవలం అలంకారప్రాయం మాత్రమే. అలాంటి మంత్రి పదవికోసం, సునందుడు తన విద్యావిజ్ఞానాలను వృధా చేసుకుంటే, అది మాతృ దక్షిణ అనిపించుకోదు. అందుకే వాటిని గురుదక్షిణ గా ఇచ్చి, గురుకులాన్ని సమర్ధవంతంగా నడిపి, తన జీవితాన్ని సార్థకం చేసుకుందామని అనుకున్నాడు. అంతేతప్ప, వాడిలో లోకజ్ఞతా, సమయ స్ఫూర్తి, లక్ష్యశుద్ధి లోపించడం వల్ల కాదు.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, భేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

ending

Source for story and images: Chandamama, April 1992.

మారిన రూపాలు

coverపట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి సమయంలో, నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు, ఇంత భీతగోల్పే శ్మశానంలో, నానా ఇక్కట్లకూ లోనవుతూండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులూ, ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి, వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటికి కారణాలు వేదికిపెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను! ఇందుకు ఉదాహరణగా, తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల, మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు యెంత అసందర్భంగా, అవివేకంగా ఉన్నదో చెబుతాను, శ్రమ తెలియకుండా వినే.” అంటూ ఇలా చెప్పా సాగాడు:

మాళవ దేశాన్ని పాలించే వీరసిమ్హుడు వ్రుద్దుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్తవయస్కుదయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి, పట్టాభిషేకం చేస్తే తన బాధ్యతా తీరిపోతుందని భావించాడు మాహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతలా దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్న వాళ్ళు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు.

MaarinaRoopalu_1ఇలా వుండగా ఒక నాడు సూర్యవర్మా, తన విదూశాకుడిని వెంటపెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తోంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులూ చేసే శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు – సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు.

ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకూ అరణ్యంలో తిరిగి, చీకటి పడుతూండగా సారధిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారాషి బాగా చీకటి పడక ముందరే నగరం చేరాలని, అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎట్టు పల్లాలుగా వున్న అరణ్య మార్గాన పరిగెత్త సాగాయి.

MaarinaRoopalu_2ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి, రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి, చెట్లు మధ్యగా తమకు ఇష్టమొచ్చినట్టు పరిగెట్టసాగాయి. సారథి వాటిని అదుపు చెయ్యలేకపోయాడు.

సూర్యవర్మ, విదూశాకుడూ, ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకుని, రథం నుంచి కిందికి దూకడం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో, రథచక్రం ఒకటి చేట్టుబోదెను దీకున్నది. దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూశాకుడూ, సారథీ దాపులవున్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొడలనానుకుని వున్న ఒక సరస్సులో పడిపోయాడు.

MaarinaRoopalu_3కొంతసేపటికి, తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సునుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో చిరిగినా దుస్తులతో పొడలనుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు, సూర్యవర్మ కేసి చూస్తూ ఒక క్షణం నివ్వెరపోయారు.

అది గమనించిన సూర్యవర్మ, వాళ్ళను, “ఏమిటలా నాకేసి వింతగా చూస్తూ, స్థాణువులా నిలబడిపోయారు?” అని ప్రశ్నించాడు.

అయితే, వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుక్కారణం, ఉరుము లాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినటుండడమే! అతడు తన శరీరాన్ని ఆపాద మస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్ళకు అందెలు! చేసిన సాముగరిడీల వల్ల ఉక్కులా వుండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది.

దానితో సూర్యవర్మకు సారథి, విదూశాకుడూ తనకేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో అర్ధమయ్యింది. ఆ సరస్సులో ఏదో మహత్యం వున్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతడు గ్రహించాడు.

తర్వాత ముగ్గురూ మౌనంగా, పల్లంలో ఒరిగివున్న రథాన్ని పైకి లాగి, ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు.

తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని, రాజడంపుతులు ఎంతగానో విశారించారు. తెల్లవారేసరికి ఈ వార్తా దావానలంలో మాళవరాజ్యమంతటా పాకిపోయింది.

“మన సూర్యవర్మ కాస్తా, సూర్యప్రభాగా మారిపోయాడు!” అంటూ నగర్ పౌరులు తమలోతాము హాస్యమాడుకో సాగారు.

సూర్యవర్మ సిగ్గుతో, ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు.

శరీరం స్త్రీత్వం సంతరించుకున్నా, సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది! ఆకారం స్త్రీది, ఆలోచనాదోరణి పురుషుడిది! ఇలాంటి సంఘర్షణతో సతమతమైసాగాడు, సూర్యవర్మ.

ఒకనాడు రాజు వీరవర్మ, ఆస్థాన దైవగ్నుడిని తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కారమార్గం ఏదైనా ఆలోచిన్చావలసిన్డిగా కోరాడు.

MaarinaRoopalu_4అందుకు దైవజ్ఞుడు, “మహారాజా! మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో, ఒక మాయసరస్సున్నది. దాని ఉనిక బహుకోద్దిమందికి మాత్రమే తెలుసు. ఒకానొక యక్షుడి శాప కారణంగా, అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, నత్రీ పురుషుడుగానూ మారిపోతారు. యువరాజు ప్రమాదవశాన అందులో పాడడం జరిగింది. అది విధి దుష్కృతం అని సరి పెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు.” అన్నాడు/

రాజు వీరవర్మ, దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమిటో బాగా అలోచించి, ఒక వర్తాహారుడి ద్వారా కుంతలరాజుకు, “మహారాజా! నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపర్యానికి లోనుకావలసి వచ్చిందో వినే వుంటారు. ఆ కారణంగా, యువరాజు, చంద్రప్రభను వివాహమాడడానికి యోగ్యుడు కాదు!” అని తెలియ పరిచాడు.

అందుకు ప్రత్యర్తంగా యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, “యువరాజా! తమకు ఆమోద యోగ్యమైతే, ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడుగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యా భర్తలు కావడానికి ఎలాంటి ఆటంకము వుండదు” అని రాసింది.

ఆ లేఖను సూర్యవర్మ చదివి, తల్లి తండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకుని, సూర్యవర్మతో, “నాయనా౧ ఈ లేఖద్వారా, చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్ధమవుతోంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా?” అని అడిగారు.

అందుకు స్త్రీ రూపంలో వున్న సూర్యవర్మ కొంత సేపు ఆలోచించి, “చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేనదుకు అంగీకరించడమంటే, మరిన్ని జాతిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడుగా తోచిన రాకుమారుడిని వివాహమాడి, సుఖ పాడమని చంద్రప్రభకు ఈ రోజే లేఖ రాసి పపుతాను.” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా! సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకునాదన్న విషయం గురించి, కార్య కారణం సంబంధాలను వేదకజూడడం వృధా శ్రమే అవుతుందికదా? అలా కాదనుకుంటే, అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరి పెట్టుకోవచ్చు. పురుషుడుగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగి మణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన, అతతడిలో మితిమీరిన అహాన్ని రేకేట్టించు వుండాలి. ఒక వేల అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే, మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేదు గదా? ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేక హీనగాను, అసందర్భంగాను లేదా? ఈ సదేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “సూర్యవర్మ నిర్ణయానికి మూలకారనమేమితో గ్రహించడం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే వున్నవి. స్త్రీ రూపంతో, పురుషుడు మనస్సుతో, జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో, అతడికి తెలుసు. ఒక వేల యువరాణి చంద్రప్రభ సరస్సు దిగి పురుశారూపంలోకి మారినా, ఆమె కూడా తన లాగే మానసిక యాతనకు గురికావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ, జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురిచేయ్యలేదు. ఆ కారణంగానే అతడు, ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతేతప్ప, ఆ నిర్ణయంలో అవివేకంగాని, అసందర్భంగాని, పురుశాహన్కారంగానీ ఏమిలేదు.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

ending

Source: Chandamama, June 1992

విక్రమార్కుడు-బేతాళుడు కథలు

coverఈ రోజు ఏ కథ రాయాలి అనుకుంటున్న టైములో భద్ర గారు మంచి సలహా ఇచ్చారు – ఈ బ్లాగ్లో కొన్ని విక్రమార్కుడు-బేతాలుడు కథలు కూడా జేర్చమని.

చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము. దూరదర్శన్ వారు కూడా ఈ కథలును సీరియల్ గా చూపించేవారు. వారమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, ఆ టైములో కరెంటు పోకూడదని గట్టిగా ప్రార్థిస్తూ వేచి చూసే వాళ్లము. ఇప్పుడు 100 చానెల్స్, వెయ్యి సీరియల్స్ చూసే జనరేషన్కి ఆ innocent pleasure అస్సలు అర్ధం కాకపోవచ్చు.

కానీ ఈ కథలు ఉత్తి వినోదం కోసమే రాసినవి కాదు. ఈ చిన్న కథలలో పెద్ద నీతులు దాగి వుంటాయి. భారతీయ సంస్కృతిలో పురాణ కథలలో వినోదంతో పాటు విద్యా, విజ్ఞానం కూడా వెదజల్లడం మామూలు విషయం. అందుకే “వెన్నతో పెట్టిన విద్య” అనే పదానికి అంత లోతైన అంతరార్ధం వుంది. నిన్న చూసిన సినిమా ఇవాళ గుర్తు వుండదు. కానీ ఈ కథలు? ఎన్నో యుగాలుగా గుర్తుండి పోయినవి.

విక్రం-బేతాళ్ కధలు దాదాపు 2500 సమత్సరాల క్రిందట మహాకవి సోమదేవ్ భట్ట సంస్కృతంలో వ్రాసిని “బేతాల్ పచ్చీసి” పై ఆధారించబడినవి. పచ్చీసీ అన్న పేరుబట్టి మొదటిలో ఇవి 25 కథల ద్వారా తెలియచేసిన నీతులని నమ్ముతారు. చందమామ magazine వల్ల popular culture లో చోటు చేసుకుని, చాలా భాషలలోకి అనువదించబడ్డాయి. విక్రమార్కుడు, బేతాళుడు ముఖ్య పాత్రల ఆధారంగా కొన్ని వందల కథలు రాసారు.

ఉజ్జయిని మహారాజు విక్రమార్కుడు తెలివైన వాడని, అనుభవగ్నుడని, అసమాన విజ్ఞాన విచక్షణ గల వాడని పేరు చెందాడు. ఆయన రాజనీతి, యుక్తి, సమస్యస్ఫూర్తి మూలంగా ఆ యుగంలో బాగా ప్రఖ్యాతి చందేరు.

విక్రమార్కుడికి రోజు ఒక యాచకుడు ఒక పండు పంపించేవాడట. ఆ పండు కొస్తే, అందులో రోజూ ఒక మణి వుండేది. ఈ విషయం ఆశ్చర్యజనకంగా అనిపించి రాజుగారు ఆ యాచకుడిని కలవాలనుకున్నారు. యాచకుడు నెలలో 14వ రోజున అర్ధరాత్రి ఒక స్మశానంలో వంటరిగా వస్తే కలుస్తానని కబురు పంపించాడు. ఈ వింత ఏంటో తనే తెలుసుకోవాలని విక్రమార్కుడు యాచకుడిని కలిసాడు. ఆ యాచకుడు ఒక చెట్టుమీద వేళ్ళాడుతున్న ఒక శవాన్ని తీసుకుని రమ్మని, ఇలా చేస్తే యాచకుడికి అపారమైన క్షుద్ర శక్తి వస్తుందని యాచించాడు. వెతికి తీసుకుని వస్తానని మాట ఇచ్చాడు విక్రమార్కుడు.

అలా చెట్టుమీంచి దింపిన శవంలో బేతాళుడు వున్నాడు. బేతాళుడు విక్రమార్కుడితో ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటాడు కాని, ఒక్క నిబంధన పెడతాడు. దారిలో విక్రమార్కుడు మాట్లాడ కూడదు. దీనికి విక్రమార్కుడు ఒప్పుకుంటాడు.

ఇలా తీసుకుని వెళ్తుంటే బేతాళుడు చిన్న కథ చెప్పి, అందులో ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబు తెలిసినా నోరు మెదలకపోతే విక్రమార్కుడి తల బద్దలైపోతుందని హెచ్చరిస్తాడు. విక్రమార్కుడు జవాబు చెప్తే బేతాళుడు మౌనభంగం కలిగినందుకు శిక్షగా మళ్ళీ తన చెట్టు మీదకి యెగిరి వెళ్లి పోతాడు. అలాగని చెప్పకపోతే తల నరికేస్తాడు.

ఇలాంటి పరిస్థితిలో ప్రతి సారి విక్రమార్కుడు జవాబు చెప్తాడు, బేతాళుడు శవంతో పాటు యెగిరి పోతాడు.

మహాకవి సోమదేవ్ భట్ట రాసిన “బేతాళ పచ్చీసి”లో చివరికి 25వ కథ అంతంలో విక్రమార్కుడు జవాబు చెప్పకుండా ప్రయాణం పూర్తీ చేసి ఆ యాచకుడి దగ్గిరకి బేతాళ్ ని చేర్చుతాడు.

కానీ చందమామ మార్చి 2013 లో చివరిసారి పబ్లిష్ అయ్యేంతవరకూ విక్రమార్కుడిని బేతాళుడి వెంట పరిగేట్టిస్తూనే వుంది!

“పట్టువదలని విక్రమార్కుడు” అన్న పదంతో మొదల్లయ్యే ఈ కథలు, చిన్నప్పుడు నేనెంత సరదాగా చదివేదాన్నో, మీరు అంత ఇష్టంగానూ చదువుతారని, మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని మీ పిల్లలకు చదివి వినిపిస్తారని ఆశిస్తున్నాను.

ending

అడవిపంది దంతాలు

 

boar and fox

ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది.

ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది.

పక్కన నుంచుని ఇటూ అటూ చాలా ఆత్రుతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు, వారిని చూసి భయ పడుతున్నట్టు  నటించింది.

అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది.

మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, “ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే?” అని చిరునవ్వుతో అడిగింది.

అడవి పంది చాలా కూల్ గా, “ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు” అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది.

నిజమే. మనలోని బలహీనతే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు.

యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ.

 

కాకరకాయ రుచి

shutterstock_473190874

అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒక సారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువు గా దొరికేది కాదు. అందుకనే కష్ట పడి, విత్తనాలు సంపాదించి, అవి నాటి, కాకర పాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని, జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి, వాటిని ఉల్లిపాయతో కూరి, బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు.

మొన్నాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్లి పోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లి ఖారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే వుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ వున్నాడు.

ఇలా ఉండగా అతని పెళ్ళం బూర్లుముక్కుడు లో మంచిగా నూని వేసి, ఉల్లిఖారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనిలో భుసభుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండ పట్ట లేక పోయింది. “రుచి ఎలా ఉందొ చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము” అనుకుని ఒక కాకరకాయ తినేసింది.

కొంత సేపటికి ఆకలి వేస్తోంది, నా వొంతు కూర, అన్నం తిందాము, అనుకుని రెండో కాయ కూడా తినేసింది.

మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు.

భోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది.

“ఇదేంటి, ఒకటే ఉంది, మిగిలిన రెండూ యేవి?” అని అడిగాడు.

“ఒకటి రుచి ఎలా ఉందొ అని తిని చూసాను. రెండోది నా వాటా, అందుకే అన్నంతో తినేసాను” అని చెప్పింది.

రైతుకి కోపం వచ్చింది. “అలా ఎలా తినేసావు?” అన్నాడు.

“ఇలా!” అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది! కాకరకాయ రుచి అలాంటిది మరి!

Image: Jamie Rogers/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

కోతి కుతూహలం

shutterstock_465905300

అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు. వారు రోజు అడవిలో చెట్లు నరికి, చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాన్నం దెగ్గిర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు.

ఒక రోజు అలాగే మధ్యాన్నం అయ్యింది. అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దెగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు.

ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది. కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ, దుంగ మధ్యలో చీలిక చూసింద. కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు.

కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది. రెండు చేతులతో లాగింది. అలా లాగ గానే చీలిక బయటికి వచ్చేసి, దుంగ లో చేసిన రంద్రం ఠక్కుమని దేగ్గిరపడి మూసుకుపోయాయి.

అందులో కోతి తోక ఇరుక్కు పోయింది. కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది. భరించలేని నొప్పి కదా! ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయ పడి పారి పోయాయి.

శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి, కోతి చేసిన పని చూసారు. కోతి తోకను విడిపించారు.

పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

గంట మొగించేది ఎవరు?

shutterstock_466396727

ఒకానోక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంట పడ్డారు.

పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి, తనూ దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు.

మళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు.

కాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు.

ఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయ పడ్డారు. గంట కొడుతున్నది ఎవరు? అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. గ్రామంలో వాళ్ళు భయ పడి అడవి వైపు వెళ్ళడం మానేశారు. కాని ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాత కాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు. పొయ్యిలోకి కట్టలు కావాలన్న, వేట ఆడాలన్నా, చాపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లక పొతే గ్రామస్తులకి ఇవన్ని ఉండవు. అది ఇబ్బందే కదా!

మాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది. గంట మొగి నప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకో లేనంత భయం. తట్టుకో లేక కొంత మంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు.

ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ “అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను!” అనుకుంది. అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది.

మొన్నాడు అలాగే వెళ్లి చూసింది. గంట చప్పుడు ఎటు వైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంత సేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది.

గంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు వున్నాయి. గాలి తగిలినా, కోతి తగిలినా, గంట ఊగి కొట్టుకుంటోంది.

అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్లి ఊరి పెద్దను కలిసి, “నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో, ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే, నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇంక ఎవ్వరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు” అని చెప్పింది.

ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాతిదేదో తెలుసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు.

మొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని, బజారులోకి వెళ్లి అరిటి పళ్ళు, మామిడి పళ్ళు, వేరుసెనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వ యే పూజ చేస్తుందో అనుకున్నారు.

అవ్వ, తన కొడుకు, ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున ఎదురు చూసారు.

అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగి పోయాడు.

అవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు.

యేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు.

అవ్వ జరిగినదంతా చెప్పింది. ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని, తెలివి తేటలని మెచ్చుకున్నారు. “అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే!” అని అనుకున్నారు.

అప్పటి నుంచి గ్రామంలో అందరు ప్రశాంతంగా వున్నారు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

లోభి నిధి

shutterstock_467444990

అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయిన చాలా లోభి. అంటే యెంత పీనాసితనం అంటే ఒక్క పైసా కూడా చేతిలోంచి జార నిచ్చే వాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్ట నిచ్చే వాడు కాదు. పైసా పైసా కూడ పెట్టి, ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు. అవి లెక్ఖ పెట్టుకోవడం ఒక సరదా.

ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి, ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి, ఆ సంచీ అందులో కప్పెట్టాడు.

అప్పుడప్పుడు గొయ్యి తీసి, సంచీ చూసుకుని, నాణాలు లెక్ఖ పెట్టుకుని, మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధిలో కలుపుతూ ఉండేవాడు.

ఇలా కొంత కాలం బాగానే గడిచింది. కాని ఒక రోజు ఇలాగే సంచీ తీసి నాణాలు లెక్ఖ పెట్టుకుంటుంటే ఒక దొంగ చూసాడు. ఇంకేముంది? రాత్రికి రాత్రి వచ్చి, గొయ్యి తీసి, సంచీ దోచేసాడు.

మొన్నాడు పెద్దాయన అలవాటు ప్రకారం సంచీ కోసం తవ్వితే అది అక్కడ లేదు!

భోరు భోరు మని ఎడిచాడు. కానీ ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుని ఏమి లాభం. పోయిన ధనం తిరిగి రాదు కదా?

ఆశాభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గిరకి వెళ్లి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు.

స్వామీజీ, “బంగారం తీసుకెళ్ళి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసారినికి ఖర్చు పెట్టుకునే వాడివి కదా?” అని అడిగారు.

“ఖర్చు పెట్టడమా! నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను! అందులోంచి ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు!” అని పెద్దాయన ఉన్నదున్నట్టు చెప్పేసాడు.

అప్పుడు స్వామీజీ నవ్వి, “ఒక సంచీలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో, నీకు బంగారు నాణాలన్నా, రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్ఖ పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి వుండదు. ఇంకది పోయిందని బాధెందుకు?” అని సలహా ఇచ్చి పంపించేసారు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

రాజుగారి కోతి

shutterstock_465319952

అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది.

ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది.

కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది. కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది.

రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది.

ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గిర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి.

అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

గోంగూర నాడే

shutterstock_500186125

Image: Ritu Jagya/Shutterstock.com

కథ మొదలెట్టే ముందర ఒక చిన్న మాట: ఈ బ్లాగ్లో ఇది 100వ కథ. అందుకనే కొంచం స్పెషల్ గా వుండాలి అనుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ ఎన్ని కథలు చెప్పినా, “ఇంకో కథ చెప్పమ్మా!” అని బ్రతిమాలే వాళ్లము. “ఏ కథ చెప్పమంటారు?” అని మా అమ్మ అంటే, “గోంగూర నాడే కథ చెప్పమ్మా!” అని ఆడిగే వాళ్లము. ఈ కథంటే నాకు, మా చెల్లెలికి చాలా ఇష్టం. మళ్ళీ మళ్ళీ చెప్పించుకునే వాళ్లము. ఈ కథకూడా ఒక తల్లికి తన బిడ్డలపై ఉండే ప్రభావం గురించి. “తల్లికి పిల్లల మీద యెంత ప్రేమ ఉన్నా అది కడుపులో పెట్టుకుని పిల్లలని బాధ్యతగా పెంచాలి” అని ఈ కథ చివర్లో మా అమ్మ చెప్పేది. ఈ కథ ఆ మాటకు చాలా మంచి ఉదాహరణం. అందుకనే ఈ కథను బ్లాగ్లో 100వ కథగా మీకు సమర్పిస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను.  

ఇప్పుడు కథ:

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

“అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు.

అమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది.

“నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు.

చేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు.

కొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు.

ఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది.

ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి, “నా కొడుకు అలాంటి పనులు చేయడు! నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో!” అని పాలేరుని తిట్టి పంపించేసింది.

పిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు.

కాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కోరలు దొంగాలించే పిల్లాడు, పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు, డబ్బులు దొంగాలించడం మొదలెట్టాడు. పిల్లాడు పెద్ద వాడైపోయాడు, ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు.

ఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి, దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది.

“ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా! నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా!” అని కొడుకు జైలుకి వెళ్ళాడు.

పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే, అవే తప్పులు ముందు ముందు అలవాట్లు, తరవాత గ్రహపాటు అవుతాయి.