Tag Archives: telugu short stories

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక

Image

 

ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు.

పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.

పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.

ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి.

పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది.

పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.

కాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం విని పించింది. పల్లెటూరి ఎలుక ఖంగారు పడి, “ఆ చప్పుడు ఏమిటి?” అని అడిగింది.

“ఇంటి కుక్కలోస్తాన్నాయి, త్వరగా దాక్కో!” అంటూ పట్నం ఎలుక ఒక రంద్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. “ఇలా ఎంత సేపు?” అని అడిగింది.

“అవి అలా వస్తూనే వుంటాయి. అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ రంద్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు” అని పట్నం ఎలుక జవాబు చెప్పింది.

ఇది విన్న పల్లెటూరి ఎలుక, “భయ పడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు!” అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.

 

(Image created with windows clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

 

పాము-స్నేహం

Picture2

అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న ఒక బైతుకు చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది.

ఆ వణుకుతున్న పామును చూసి ఆ బైతుకు చాలా జాలి వేసింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు.

జాలితో ఆ బైతు పామును తన ఛాతీ దెగ్గిరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది.

వేంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ బైతును కాటువేసింది. పాపం ఆ బైతు పాముకాటుకి మరణించాడు.

దుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు.

(image created with windows clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

సింహము-ఎలుక

Picture2

అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.

సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది.

“నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది.

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి.

కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది.

సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది.

“చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!” అనుకుని తన దారిని వెళ్ళింది.

(image created with windows clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

ఆమ్మాయి కలలు

My daughter Megha told me this story, I think she heard it from my mother. She wanted to contribute to my blog so she asked me to post it – this one is for her. Hope you enjoy it.
Picture2

అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది.

ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాల సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.

దారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.

ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను.

కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా ఆవులు వుంటాయి.

అవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను. నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే అవసరం వుండదు. అప్పుడు నేను కూడ తెల్లగా అయిపోతాను.

వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు, గొలుసు కూడ కొనుక్కుంటాను.

ఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని వెళ్తాను.

అక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది ఒప్పుకోను”

నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న విషయం మరిచిపోయింది.

ఢడేలుమని బిందె తలనించి పడి ముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.

ఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ డబ్బులూ సంపాదించలేదు, ఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు, పట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు – ఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి.

పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకు వెళ్ళి పోయింది.

(image created with windows clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

కాకి దాహం

Picture4

 

p>అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.

చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు.

కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది.

నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.

ఈ కధ నేను మా అమ్మాయి మేఘా కి చెప్పాను. అప్పుడు మేఘా నాతో అంది: “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక straw వెతికి తాగేది”.

ఈ మాట విని నాకు చాల ఆశ్చర్యం అనిపించింది. ఈ కథ వెయ్యి సార్లు విన్నా ఈ మాట నాకు తట్టలేదు. నిజమే ఈ రోజుల పిల్లలు చాలా smart!

 

(Image created with windows clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

నోరు జారిన మాటలు

Picture7

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.

ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.

మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.

“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.

సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.

మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.

వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.

అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.

ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.

దీపావళి పోటీ

Picture5

అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.

ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.

రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.

ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.

ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.

ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.

“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.

జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.

మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.

మంత్రి, సామంతరాజు

అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాల సార్లు ఆహ్వానించాడు. కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు.

ఒక రోజు ఆ చక్రవర్తి మారు వేశం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్యారాడు. బజారును తనిఖి చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళో కి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు.

పర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు.

ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి యెందుకలా చేసాడని కన్నుక్కున్నాడు. దానికి మంత్రి, “మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రొధం చూస్తే అతన్ని గొర్రెను కోసినట్టు సమ్హరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి, మీ మనస్థిథి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి” అని జవాబు చెప్పాడు.

చక్రవర్తి ఆ వివేకంగల మంత్రి దూరదృష్టిని అభినందించాడు.

కన్న మమకారం

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒకావిడ ఉండేది. ఆవిడ కొడుకు జబ్బు పడి ప్రాణాలను కొలిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ క్రుంగి పోయింది. చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మట్టుకు తగ్గలేదు, యే రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలో యెప్పుడూ వుండెది.

ఒక రోజు ఊరిలోకి ఒక బొధిసత్త్వుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానముగల వాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింప చేయ గలుగుతాడేమోనని ఆశ పడింది. వెళ్ళి ఆ బొధిసత్త్వుడి కాళ్ళ మీద పడి, తన కొడుకుని మళ్ళి తనకు దక్కేలా చెయమని అడిగింది.

ఆ బొధిసత్త్వుడు ఊళ్ళో యెవ్వరూ మరిణంచిని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రమ్మన్నాడు.

మొన్నాడు ఉదయమే లేచి, స్నానం చేసి, దెవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటలోని నిలుచుని వాళ్ళింట్లో యెవరైన మరణించారా అనడిగింది. ప్రతి ఇంట్లోను యెవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు. నిరాశ చందినా అవిడకు జీవితంలో చావు కూడ ఒక భాగమని, అది యెవ్వరు తప్పించలేరని అర్ధం అయ్యింది.

మాధవ ముంగిస

ఉజ్జైని నగరంలో మాధవా అనబడే బ్రాహ్మడుండేవాడు. ఒక రోజు బ్రాహ్మడి భార్య పక్కవూరికి పేరెంటానికి వెళ్తూ వాళ్ళ పసి పాపను బ్రాహ్మడికి అప్పచెప్పి వెళ్ళింది. ఇదిలా ఉండగా రోజు మహారాజుగారు బ్రాహ్మడిని సభకు రమ్మని కబురు పెట్టారు. పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్ళడమని ఆలోచిస్తున్న బ్రాహ్మడికి అతని ముంగిస కనిపించింది. “ముంగిస చాలా యేళ్ళగా నా దెగ్గిర నా కొడుకులానే పెరుగుతోంది, దీనికి పాపను అప్పచెప్పి వెళ్తానుఅనుకుని రజ్యసభ వైపు బయలుద్యారాడు.

ముంగిస తనను నమ్మి పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వ పడింది. వెళ్ళి పాప దెగ్గిరే కూర్చింది. సమయానికి ఒక పామును పాప వైపుకు వెళ్తూ చూసింది. వెంటనే పామును చంపేసింది.

కొంత సేపటికి మాధవ రజ్యమర్యాదలన్ని స్వీకరించి, రాజు ఇచ్చిన బహుమానాలతో సంతోషంగా
ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆనందంతో ముంగిస అతని దెగ్గిరకు గబగబా వెళ్ళింది. మాధవ ముంగిస మూతికున్న నెత్తురును చూసాడు. పాపను చంపేసిందని అపోహ పడ్డాడు. కోపంగా ముంగిసను చంపేసాడు. బాధతో ఇంటిలోకెళ్ళాడు. ఎదురుగానే పసి పాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది. పక్కనే చచ్చి పడున్న పామును చూసి మాధవ అన్ని అర్ధం చేసుకున్నాడు. అయ్యో తొందరపడ్డానే! అని చాలా పశ్చాతాప పడ్డాడు.

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 164గురు చందాదార్లతో చేరండి