Tag Archives: tenali ramakrishna

కట్టెలుకొట్టేవాడి కథ

shutterstock_577863937

Image: Ritu Jagya / Shutterstock.com

అనగనగా ఒక కట్టెలుకొట్టే వాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వాడు. తెల్లారకుండానే అడవిలోకి వెళ్లి, కట్టెలు కొట్టుకుని, ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఒక రోజు కాలవ గట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడి పోయింది. నీళ్ళల్లో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేక పోయింది. ఎక్కడా గొడ్డలి దొరకలేదు.

కాలవ గట్టున కూర్చుని, అయ్యో అని బాధ పడుతూ ఎడిచాడు. రెక్క ఆడనిదే డొక్క ఆడాడు, అన్నట్టు, పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్ట లేడు. కట్టెలు కొట్టక పొతే, అవి అమ్మ లేడు. అమ్మక పొతే, డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే, కుటుంబమంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు. ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లీ, అని మనసారా మొక్కు కున్నాడు.

దేవత ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకుని, నదిలోకి దిగి, ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అతన్ని అడిగింది.

అతను, “కాదమ్మా, ఇది నాది కాదు” అని చెప్పాడు.

దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి, ఒక వెండి గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?”

“కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు.

ఈ సారి దేవత చాలా సేపు నీళ్ళల్లో వెతికింది. వడ్డున కట్టెలుకొట్టే వాడు చాలా ఖంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా, దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి, “ఇది నీదా?” అని అడిగింది.

సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అమ్మయ్య అనుకుని, “అవునమ్మ! ఇదే నాది!” అని అందుకోవడానికి చేతులు జాపాడు.

వన దేవత అతని నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గోడ్డలు ఒకటే కాక, ఆ బంగారం గొడ్డలి, వెండి గొడ్డలీ కూడా అతని చేతుల్లో పెట్టింది. “నీ నిజాయతీ నాకు నచ్చింది, ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే!” అని చెప్పింది.

కట్టెలు కొట్టే వాడు కళ్ళకి అద్దుకుని మూడు గోడెల్లూ తీసుకున్నాడు.

ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డలి, బంగారం గొడ్డలి అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు.

అవి కొనుక్కున్న షావుకారు, “ఇవి నీకు ఎక్కడివి?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు.

ఆ షావుకారుకి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్లి, కాలవలోకి విసిరేసి, వన దేవతని ప్రార్థించాడు.

వన దేవత ప్రత్యక్షం అయ్యింది.

షావుకారు, “నా గొడ్డలి ఏట్లో పడిపోయింది, కొంచం సహాయం చేయి తల్లీ” అని ప్రాధేయ పడ్డాడు.

వన దేవత నీళ్ళల్లో దిగి, ముందర లాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది. “ఇది నీదా?” అని అడిగింది.

ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే, ఉండ పట్టలేక, “అవునమ్మ! ఇది నాదే!” అని అబద్ధం చెప్పాడు.

వన దేవతకి కోపం వచ్చింది. “అబద్ధం!” అని మాయం అయిపొయింది.

షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా, తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించ లేదు.

ఇందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకీ ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్లకి మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది.

 

 

గుమ్మడికాయ దొంగ

shutterstock_584106523

ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవేరో దొంగ రోజు దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్ట పడే వారు.

గుమ్మడికాయ దొంగ ఊళ్లోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దెగ్గరకు వెళ్ళారు.

పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మోర విని, “ఓస్! ఇంతేనా! గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది” అన్నాడు.

ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.

పెద్దాయన వెంటనే ఇది గమనించి, “దొంగ ఇతనే!” అని అందరికి చెప్పారు. “మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము” అని వివరించారు.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

కొంగ కోరికలు

Picky Crane

ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.

ఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.

చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.

అలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.

మధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.

క్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.

ఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.

ఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.

(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

బంగారు పళ్ళం

shutterstock_398708479

ఒక ఊరిలో సాహు, శీను, అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని రెండు భాగాలగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి, మధ్యాన్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటి పడక్కరలేదు.

ఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుదేసలో ఒక అవ్వ, ఆవిడ మనవరాలు ఉండే వారు. మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ – అంత డబ్బు పాపం అవ్వ దెగ్గిర లేదు.

“నా దెగ్గిర ఒక పాత పళ్ళం ఉంది, డానికి మసి పట్టుకుంది, కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా?” అని అవ్వ సాహుని అడిగింది.

సాహు పళ్ళం తీసుకుని చూసాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం! చాలా విలువైనది. సాహుకి దురాశ కలిగింది. “ఈ పళ్ళమా! ఇది దేనికి పనికొస్తుంది! పూర్తిగా మసి పట్టుకు పోయింది! దీనికి గాజులు రావు కాని, కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో!” అన్నాడు.

అవ్వ పాపం పళ్ళం తీసుకుని వెళ్లి పోయింది. సాహు మళ్ళీ మొన్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోక పొతే ఇంకొంచం ధర పెంచి తీసుకోవచ్చు, అనుకుని వెళ్ళిపోయాడు.

ఒప్పందం ప్రకారం మధ్యాన్నం అటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళం తీసుకుని గాజులివ్వమని అడిగింది. శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళం అని తెలుసుకున్నాడు. కానీ శీను మంచి వాడు. వెంటనే అవ్వతో, “ఇది బంగారు పళ్ళం అమ్మా! ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దేగ్గిరా లేదు. కాని మన సామంత రాజు దేగ్గిరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దెగ్గిర గాజులు కొనుక్కుని, మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు, నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు”, అని చెప్పాడు.

అవ్వ ఒప్పుకుంది.

విషయమంతా సామంత రాజుకి చెప్పారు. సామంత రాజు అవ్వ దెగ్గిర పళ్ళం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శీను నిజాయితిని మెచ్చుకుని, కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు.

ఇక సాహు సంగేంటంటే, ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి, అతని దెగ్గిర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్ట పడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేస్సాడు కాని కిట్టుబాటు కా లేదు. వ్యాపారం లో నష్టము వచ్చి, మరే ఉద్యోగమూ దొరకక, ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది.

ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగు పడరు.

Image: Veranika _Alferava/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce

ఉల్లిపాయి దొంగ

onion thief

ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దెగ్గిరకు   తీసుకుని వెళ్ళారు.

న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకో మన్నాడు – ఒకటే సారి దొంగలించిన ఉల్లిప్పాయలన్నీ తినడమా; వంద కొరడా దెబ్బలు భరించడమా, జురుమానా చెల్లించడమా?

ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించ కుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు.

ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి గా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కు లోంచి నీళ్ళు కారడం మొదలైంది. ఐనా మొండి గా ఇంకో రెండు తిన్నాడు, కాని ఇక వీలు కాలేదు.

సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు. కొరడా దేబ్బాలంటే మాటలా? నొప్పి తట్టుకో లేక పోయాడు.

బాబోయి! బాబోయి! జరిమానా కట్టేస్తాను, ఆపండి! అని ఏడుపు మొదలెట్టాడు.

ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు.

ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్ధం అయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని, వేరే టప్పుడు పనులు కాని చేయలేదు.

కొంత మంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి, ప్రత్యామ్నాలు పరిశీలించాలీ. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.

(Image in this story is a composite created with free Bing clip art – any copyright violations are unintentional and image will be removed if you let me know.)

ఎనుగ తో స్నేహం

forest animals

ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది.

చెట్టు మీద కోతిని అడిగింది, “కోతి, కోతి, నాతొ స్నేహం చేయవా?”

“నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడ లేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను?” అంటూ కోతి వెళ్లి పోయింది.

ఏనుగు చెట్టు మొదల్లో వున్న కుందేలుని అడిగింది, “కుందేలు, కుందేలు, నా తో స్నేహం చేస్తావ?”

కుందేలేమో, “నువ్వు నా లాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను?” అంది.

ఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. “కప్పా, కప్పా, నా తో స్నేహం చేయవ?” అని అడిగింది.

“నువ్వు నా లాగా గెంత లేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను?” అని కప్ప కూడా స్నేహం చేయలేదు.

ఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ, అన్నిటిని స్నేహం చేయమని అడిగింది. కాని అన్నీ ఏనుగు ని కాదని వెళ్లి పోయాయి. ఏనుగు పెద్దగా, నిదానం గా వుంటుంది కదా, వేరే జంతువుల లాగ ఎగర లేదు, గెంత లేదు, పరిగెత్త లేదు. అందుకని ఏ జంతువూ ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడ లేదు.

ఏనుగు పాపం వంటరి గానే వుండి పోయింది.

ఒక రోజు అడవిలో జంతువులన్నీ గబ గబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయం కనుక్కుంది.

“అడవిలోకి ఒక పులి వచ్చింది, ఆ పులి అన్ని జనువులని తినేస్తోంది, అందుకనే పారిపోతున్నాము” అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది.

ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే “పులి గారు, ఈ జంతువులను తినకండి, ప్లీజ్” అని అడిగింది.

పులి వికటంగా నవ్వి, “నీ పని చూసుకో పో!” అంది.

ఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగా బడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది.

ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులూ ఏనుగు మిత్రులై పోయాయి. అందరు కలిసి ఆడుకున్నారు.

మనలా లేని వాళ్ళను మనము ఎప్పుడు చిన్న చూపు చూడ కూడదు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ వుంటుంది.

నూతిలో నక్క

 

నూతిలో నక్క

అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది.

బావి చాలా లోతుగా వుంది. యెంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేక పోయింది. తెలారేదాక అలాగే నూతిలో ఉండిపోయింది.

మొన్నాడు ఆ బావి దేగ్గిరకి ఒక మేక వచ్చింది.

“అమ్మయ్య! మనం బయట పడచ్చు”, అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది.

మేక బావిలోకి చూసింది. చూస్తే అక్కడ నక్క కనిపించింది.

“ఇదేంటి? బావిలో ఎం చేస్తున్నావు?” అని అమాయకంగా అడిగింది మేక.

“ఈ బావిలో నీళ్ళు యెంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్ళు తాగడానికే ఇక్కడికి వచ్చాను. అసలు చక్కర కలిపినంత తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పింది నక్క.

“అవునా! నిజమా?” అని అడిగింది మేక.

“కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అంది నక్క.

అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచిన్కాకుండా నూతి లోకి దున్కేసింది. నీళ్ళు తాగింది. కొంత సేపటికి నక్క లానే మేక కూడా ఇరుక్కు పోయింది.

“ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా?” అని నక్కని అడిగింది.

“ఓస్! దానిదేముంది! ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్లి, తరువాత నిన్ను పైకి లాగెస్తాను!” అని ఐడియా ఇచ్చింది నక్క.

సరే బాగానే ఉంది అనుకుని మేక ఒప్పుకుంది.

నక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతి లోంచి బయట పడింది! “బ్రతుకు జీవుడా!” అనుకుంది.

మేక బయటికి రావడానికి చేయి అందించ మని అడిగింది. “నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా వుంది, నువ్వు బరువుగా వున్నావు” అని నవ్వుకుంటూ నక్క వెళ్లి పోయింది.

మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది. కాని ఏమి లాభం? నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాల్సింది కదా?

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

డేరా లో ఒంటె

shutterstock_63386905

ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ (ఎడారిలో ఏర్పడే జలాశయము) దెగ్గిర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి, ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు.

ఎడారిలో పగటి పూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది.

ఆ చలిలో వొణుకుతు షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు.

బయట వున్న ఒంటేకి చాలా చలి వేసింది. చివరికి డేరా లో ముక్కు దూర్చి, “షేకు, ఇవాళ చాలా చల్లగా వుంది, నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను నా ముక్కు మట్టుకు పెట్టుకుంటాను” అని దీనంగా అడిగింది.

షేకు కి జాలి వేసింది. అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు.

కొంత సేపటికి ఒంటె షేకుని మళ్ళి నిద్ర లేపింది. ముక్కోకటే పెట్టుకుంటే చలికి ఆగట్లేదని, అలాగే తల దాచుకోవడానికి చోటు ఇవ్వమని అడిగింది. షేకు ఒప్పుకున్నాడు.

తల పెట్టు కున్నాక కొంత సేపటికి ఒంటె షేకు ని మళ్ళి నిద్ర లేపి, తల దాచుకున్నాక మెడకు మట్టుకు యెంత స్థలం కావాలి, మెడ కూడా పెట్టుకొనా అని అడిగింది. షేకు మళ్ళి ఒప్పుకున్నాడు.

అక్కడతో ఆగిందా? ఇలా కొంచం కొంచం దేరలోకి దూరి, ముందు కాళ్ళు, వొళ్ళు, తోక కూడా దేరలోకి దూర్చింది.

ఒక్క మనిషి కోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఒంటె ఎలా పడుతుంది? కొంచం కొంచంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేకుని డేరా బయటికి తోసేసింది. ఆ షేకు యెంత ప్రయత్నించినా కొంత చోటు కూడా ఇవ్వలేదు. అసలు ఆ షేకుని మళ్ళీ దేరలోకి కాలు పెట్టనివ్వలేదు.

పాపము, ఆ షేకు ఒంటెకు మంచి చేయబోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది.

మన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదటిలో ఇది చిన్న విషయమే కదా, మనం కంట్రోల్ చేయచ్చు అనిపిస్తుంది, కానీ ఆ అలవాటు మనకి తెలీకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించు  కుంటుంది. మొదటిలో అలవాటే, కాని రాను రాను గ్రహపాటు అవుతుంది. అందుకే చిన్నదే అయినా సరే, దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు.

Image: EMJAY SMITH/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

మొసలి కన్నీళ్లు

crocodile tears

అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా? అది ఎవరికి తెలీదు. ఎలాగో పరిచయం అయ్యింది.

కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది, అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి. కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది.

ఒక రోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది.

“ఏంటిది, నిజామా? నీకు ఒక కోతి తో స్నేహముందా?” అని ఒక రోజు మొసలిని అడిగింది.

మొసలి ఒప్పుకుంటూ, “అవును, చాలా రోజులు గా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది” అన్నాడు.

మొసలి భార్య, “కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుందేకాయిని  పంచుకుని తినచ్చు” అంది.

మొసలి కి భార్యమీద పిచ్చి కోపం వచ్చింది. “కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది. స్నేహితుడిని ఎలా చంప మంటావు?” అని కోపంగా అడిగాడు.

భార్య మూతి ముడుచుని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లి పోయాడు.

మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదల కుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి, ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది.

చివరికి నస భరించలేక ఒక రోజు మొసలి ఒప్పుకున్నాడు. “సరే, ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ” అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుద్యారాడు.

కోతిని చెట్టు మీంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పడకం వేసాడు.

చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది.

మొసలి కోతితో,”మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకి చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకు రమ్మంది,” అని ఆహ్వానించాడు.

కోతి సంబర పడింది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్లి, తిరిగి తీసుకు వస్తాను అంది.

కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది.

మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్ళాడు.

దారిలో మొసలి ఏడవడం మొదలట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఎడుస్తున్నాడని మొసలి ని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆప లేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ళ మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు.

భోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి, తన భార్యా కోతిని తిందామని ఈ పడకం వేసారని నిజం చెప్పేసాడు మొసలి.

ఈ మాట విన్న కోతికి ఒక్క సారి గుందేలాగి పోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క, బుర్రోలో ఒకటే సారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన, ఎన్ని రక రకాల భావాలు ఒకటే సారి కలిన్గుంతాయో మీరు ఆలోచించ గలరు.

కాని కోతి చాలా తెలివైనది. అంత సులువు గా ప్రాణాలు వాదులు కుంటుంద? ఈ భావాలేమి మొసలికి తెలీయనివ్వ లేదు. గట్టిగా నవ్వడం మొదలిట్టింది.

మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగి పోయాయి. ఇది ఊహించలేని రియాక్షన్ కదా.

కోతి మొసలితో అంది, “ఓస్! ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చే వాడిని. కాని ఇప్పుడు అది నా దెగ్గిర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళి ఇంటికి తీసుకుని వెళ్తే, చేట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీ గా తినచ్చు” అంది కోతి.

మొసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి “అమ్మయ్య!” అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మీంచి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్లి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది.

మొసలి చాలా సేపు ఎదురు చూసి మొత్తానికి కోతి ని పిలిచింది.

కోతి కొమ్మ మీదే కూర్చుని, “గుండె లేదు ఏమి లేదు! అసలు నీ లాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు” అని కోపంగా చెప్పింది.

మొసలి తల దించుకుని వెళ్ళిపోయింది.

చేడువాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడె చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.

పొగడ్తలతో పడగొట్టిన నక్క

Aviveki kaki

ఒక రోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టి ముక్క దొరికింది.

కాకి చాలా సంతోషంగా ఆ రొట్టి ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంది.

నోట్లో రోట్టిముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టి ముక్క కావాలనుకుంది. కానీ ఎలా? కకేమో చెట్టు మీద వుంది. నక్కేమో చెట్టు యెక్క లేదు. ఇప్పుడు నక్క ఏమి చేయాలి?

ఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది.

“ఓహో కాకి! యెంత బాగున్నావు ఇవాళ? నిగ నిగాలాదిపోతున్నావు!” అంది నక్క.

పొగడ్త వినగానే కాకి పొంగి పోయింది. ఈ విషయం నక్క గమనించింది. పొగడ్త కొనసాగించింది.

“ఆ మిల మిల మెరిసిపోతున్న కళ్ళు, సూటిగా వున్న ముక్కు, బ్రహ్మాండమైన నీ రెక్కలు, అసలు యెంత సేపైనా రెప్ప వాల్చ కుండా చూడవచ్చు. నీ శరీరం ఇంత అందంగా వుంటే ఇంక నీ గొంతు యెంత అదిరి పోతుందో ఊహించుకుంటేనే … ఆహ! అసలు ఒక్క సారి నువ్వు పాడితే వినాలని వుంది. ఒక్క పాట పాడవా?”

పొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే “కావు! కావు!” అని నోరు తెరిచి పాట మొదలెట్టింది. నోట్లోని రొట్టి ముక్క జారి కింద పడిపోయింది.

వెంటనే నక్క రొట్టి మిక్కను నోట్లోవేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది.

రొట్టి ముక్క కోసమే తనని నక్క పోగిడిoదన్న విషయము గ్రహించిన కాకి బాధ పడింది. ఇంకెప్పుడు పొగిడే వాళ్ళను నమ్మ కూడదని సంకల్పించుకుంది.