కోతి, అద్దం

ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.

భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు.

తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.

ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.

చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది.

కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.

అద్దం, రాయి

ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”.  ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.

కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.

ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.

“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.

“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.

చారలు కోరిన నక్క

పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.

రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.

ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.

నక్కా, పీతలు

ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.

“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క.

పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.

“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క.

“ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు.

“తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క.

పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.

రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.

“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది.

భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.

కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.

ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.

ఇద్దరు శిశ్యుల కథ

ఒక గురువుకు ఇద్దరు శిశ్యులుండేవారు. ఆ గురువు ఒక రోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చాడు. “నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కాని దీనితో మీరు ఎదైన కొని ఒక గదిని నింపాలి” అన్నాడు.

మొదటి శిశ్యుడు సొమ్మంతా ఖర్చు చేసి, బోల్డంత ఎండుగడ్డిని కొని గదిలో నింపాడు. గురువును చూడమని ఆహ్వానించాడు. గురువు అది చూసి “గదిని నిరుత్సాహముతో నింపావు” అన్నారు.

రెండవ శిశ్యుడు ఒక చిన్న కాసును ఖర్చు చేసి ఒక దీపం కొన్నాడు. దాన్ని వెలిగించగానే గదంతా కాంతితో నిండిపోయింది. గురువు మెచ్చుకుని, నలుగురికీ వెల్తురు ఇద్దామనుకునే వాడే నిజమైన వివేకవంతుడని అభినందించాడు.

కుక్కా, వ్యాపారస్తుడు

ఒక ఊరిలో ఒక కుక్కల వ్యాపారస్తుడుండేవాడు. అతను కుక్కలను కొని, వాటిని పెంచాలనుకునే వాళ్ళకు అమ్ముకునేవాడు.

ఒక రోజు అతను పొలాల్లోంచి వెళ్తుంటే అక్కడొక కుక్కను చూసాడు. ఆ కుక్క అతని దెగ్గిరకు వెళ్ళి తనని కొనుక్కోమని ప్రాధేయ పడింది. ఆ వ్యాపారస్తుడు “నీలాంటి కురూపిని ఎవరు కొనుక్కుంటారు?” అని ఛీ: కొట్టాడు.

కొద్ది రోజుల తరవాత ఆ కుక్క రజగృహం దెగ్గిరకు వెళ్తే అక్కడ రక్షక భటుడు దాన్ని చూసి నిమురాడు. అప్పుడే ఆ వ్యాపారస్తుడు అటు వైపు వచ్చాడు. కుక్క అతన్ని మళ్ళీ తనను కొనుక్కొమని అడిగింది.

“నువ్వు రాజ మహలులో వుంటున్నావు, చక్రవర్తిని కాపలా కాస్తున్నావు – నీ విలువ నేను ఇచ్చుకోలేను” అని వెళ్ళి పోయాడు.

నిజమే, మనం ఎక్కడున్నామో, ఎవరితో ఉన్నామో, దాన్ని బట్టే మనుషులు మన విలువను నిర్ధారిస్తారు.

కప్పా, పాము

ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.

పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.

కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.

కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.

చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.

నక్కా, సింహం, జింకా

అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.

ఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.

సింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.

సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.

దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.

నక్కా, కోడి పుంజు

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు.

ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది.

ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. “హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!” అంది కోడి పుంజు.

“లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది” అని జవాబు చెప్పిందా నక్క.

పుంజు వెంటనే తన పిల్లలను లెక్ఖ పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. “ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ వున్నా నాకు తెలియలేదే,” అంది.

“యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనె వచ్చావు” అంది నక్క వ్యంగ్యంగా.

నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.

మంత్రి, సామంతరాజు

అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాల సార్లు ఆహ్వానించాడు. కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు.

ఒక రోజు ఆ చక్రవర్తి మారు వేశం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్యారాడు. బజారును తనిఖి చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళో కి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు.

పర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు.

ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి యెందుకలా చేసాడని కన్నుక్కున్నాడు. దానికి మంత్రి, “మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రొధం చూస్తే అతన్ని గొర్రెను కోసినట్టు సమ్హరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి, మీ మనస్థిథి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి” అని జవాబు చెప్పాడు.

చక్రవర్తి ఆ వివేకంగల మంత్రి దూరదృష్టిని అభినందించాడు.