ఎద్దు గర్వం

ఒక ఊరి లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, మూగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించేవారు.

ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు.

మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహ! చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు.

ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి, బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.

ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి, నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడనుకోండి!

ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు.

విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది? అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపాయి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు.

అప్పుడు రాముడికి అర్ధమయ్యింది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.

పంది భయం పందిది !

ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది.

గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది.

ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు. అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది.

అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది: “ఎందుకు అంత గోల పెడుతున్నావు? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము”

వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి.

దానికి పంది ఇలా జవాబు చెప్పింది. “మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి, మేతకు తీసుకువెళ్లి, మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా? నన్ను వొండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో? నా భయం నాకు ఉంటుంది కదా!” నిజమే. ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహస మంతుల లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి.

పిచుక గుణం

sparrow and crows

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

దేవుడే కాపాడుతాడు!

అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.

ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు.

అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది.

ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.

అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”

ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు.  ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.

ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.

కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.

చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.

“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.

పూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.

కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.

పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.

ఒక కోతీ, రెండు పిల్లులు

 

అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి. నాదంటే నాదని హోరా హోరీ గా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది.

ఎంత సేపటికి వాటి గొడవ తీరట్లేదు, ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు.

మొత్తానికి కోతి వాటిని విడతీసి, “ఇంతోటి దానికి ఎందుకు దేబ్బలాడుతున్నారు? మీ సమస్యకి ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను” అని చెప్పింది.

కోతి మాట ఆ పిల్లులకు నచ్చింది. ఆ రొట్టి ముక్క ను కోతికి అంద చేసారు.

కోతి ఆ ముక్కను రెండు గా చేసింది. “అయ్యో! ఒక ముక్క పెద్దగా వుందే!” అని కోతి ఆ ముక్క ను కొంచం కొరికి తినేసింది.

“అరెరే! ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపొయింది!” అని రెండో ముక్కలో కొంచం తినేసింది.

“ఛ! ఇప్పుడు ఇది పెద్దగా అయిపొయింది!” అని మళ్ళి మొదటి ముక్కలో కొంచం తినేసింది.

ఇలా కొంచం కొంచం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని, తుర్రున చెట్టెక్కి పడుక్కుంది.

పిల్లులు రెండూ నోరు వెలేసి చూస్తూ వుండి పోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్లి పోయాయి.  అందుకే, పెద్దలు మనకి ఎప్పుడు చెపుతూ వుంటారు – ఇద్దరి మధ్య గోడవయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చండుతుందని.

రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో

shutterstock_551670577అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.

“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.

వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.

మొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.

రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.

వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.

“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.

ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.

మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.

మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.

సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.

రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.

సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.

ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”

లండన్ దా, అమెరికాదా?

శీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా జేరాడు.

ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికి అతను యెంతో ధనవంతుదని, ప్రపంచమంతా చూసాడని తెలియాలని బాగా తపన పడేవాడు.

ఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శీను ని పిలిచి, “శీను, వెళ్లి దుర్భిణి పట్టుకురా!” అన్నాడు. దుర్భిణి అంటే బైనాక్యులర్స్. శీను లోపలి వెళ్లి అడిగినట్లే దుర్భిణి తెచ్చి ఇచ్చాడు.

వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఆ ధనవంతుడు శీనూను పిలిచి తిట్టాడు. “దుర్భిణి తెమ్మంటే తెచ్చేయడం కాదు! యే దుర్భిణి, లండన్ దా అమెరికా దా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుదినో అందరికి తెలిసేది?” అన్నాడు.

శీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేస్తాను సారూ” అన్నాడు.

కొన్ని రోజుల తరవాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్ లో వున్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు.

ధనవంతుడికి అలవాటే కదా, బడాయిలు చెప్పుకుంటూ, “ఇది మా నాన్న గారు వేట కి వెళ్లి చంపిన పులి!” అంటూ, శీనుని పిలిచి, “మా నాన్నగారి ఫోటో వుండాలి తీసుకుని రా!” అన్నాడు.

వెంటనే అమాయకపు శీను, “యే నాన్నగారు సారూ, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?” అని అడిగాడు!

యే జాతికీ చందలేని గబ్బిలాలు

ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి.

ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.

ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.

యుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.

ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.

యుద్ధం ముగిసి పోయింది.

కాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.

పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కారించాయి.

యే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి.

కాకి హంస కాగలదా?

shutterstock_438665143

ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది! ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది.

ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి.

మొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా!

అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది.

అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది.

కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది.

ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

 

బాటసారుల అదృష్టం

travelers luck

అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.

దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి!

“నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు.

“నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు.

“అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు.

రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు.

ఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు!

“అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు.

“మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.

మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా!

Image: Igor Malovik/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.