Tag Archives: neeti kathalu

పిచుక గుణం

sparrow and crows

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో

shutterstock_551670577అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.

“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.

వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.

మొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.

రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.

వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.

“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.

ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.

మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.

మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.

సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.

రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.

సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.

ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”

అనంతుడి కోరిక

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా స్మశానానికేసి నడవసాగాడు.

అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, విద్యాదికుదివైన నువ్వు, భీతగోల్పే ఈ స్మశానంలో, నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సాహిస్తున్నావంటే నమ్మసఖ్యం కాకుండా వున్నది. ఇంతకూ దీనికి కారకులు, నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్న కుత్సిత మనస్కులై వుండాలి. అలాంటి వాళ్ళ వలలో చిక్కి, కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తనమేలును కూడా మరచిన అనటుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్పసాగాడు:

పూర్వం మందారకమే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు, సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసురాగానే రాజు, అతణ్ణి గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు.

anantudu_1గురుకులంలో మొత్తం పదిమంది విద్యార్దులున్దేవారు. వారిలో ఒక్క అనటుడనే విద్యార్ధి తప్ప మిగిలినవారందరూ, విరజుడు రాజుకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా, ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది.

అయితే, విరజుడిలో తను రాజకుమారుదనన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడూ కావడంతో, అనంతుడి మీద అప్పుడప్పుడూ అధికారం చలాయించేవాడు. అయినప్పిటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుది పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు.

విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకేక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక, తీరిక సమయాలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్మయ్యేలా ఒకటికి నాలుగు సార్లు భోదించే వాడు.

ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పున్జుకోగానే, గురువు గోబిలుడు దాన్ని గమనించి, అతడికి మరింత ప్రోత్సాహజనకంగా వుండడం కోసం, అడపాదడపా ప్రశ్నించటం ప్రారంభించాడు. మొట్ట మొదటిసారి గురువు ప్రస్నించ గానే విరజుడు, అనంతుడితో, “అనంతా! ఈ రోజు గురువుగారు నన్ను ప్రస్నిన్చారంటే, ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను!” అన్నాడు.

విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి, విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, “నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి! నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో” అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు.

అయితే, ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ, నానాటికీ అహంకారం పెంచుకుని, అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు. అలా కొంత కాలం గడిచి, ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి, విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది.

అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే, గురువు గోబిలుడితో, “స్వామీ! నాకింకా విద్యా తృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే, ఆరావళీ పర్వత పాదాల వడ్డన వున్న కృష్ణచంద్రులవారి గురుకులంలో కొన్నేళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని వుంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే, విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను.” అన్నాడు.

గోబిలుడు, అనంతుడు కోరిన దానికి సంతోషంగా, “ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది. వెళ్లిరా నాయనా, శుభస్య శీఘ్రం!” అంటూ ఆశీర్వదించి పంపించాడు.

ఆ తర్వాత, విరజుడు కూడా గురు దక్షిణ చెల్లించి, రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే, తనకు పూర్తీ అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుదనేవాడిని తన ప్రధానసలహాదారుడిగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో, ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది.

anantudu_2సుప్రతీకుడు, రాజూ కలిసి వినూత్న పరిపాలన పేరిట, పరిపాలనలో అనేక మార్పులూ, సంస్కరణలూ ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థ లో పడి, తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచ సాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగు రాజు, విరజుడి రాజ్యంపై దండెత్తాలను కుంటున్నాడని గూఢచారులవల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కొంగారుపడి, సుప్రతీకుడిని సంప్రదించాడు.

సుప్రతీకుడు తేలిగ్గా, “భయం ఎందుకు, ప్రభూ! మనం హేచ్చువేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకుని, మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మనవసమైతే, తమరి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి!” అన్నాడు.

“నువ్వు చెప్పెదీడీ చిటికలో ముగిసే పనికాదు. మన ఖజానాలో అంతగా నిల్వదబ్బు లేదని, నీకు తెలియనిదా?” అన్నాడు.

దానికి సుప్రతీకుడు నవ్వి, “మన ఖజానా నింపేందుకు, ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణిశైలం గురించి మీకు తెలుసుగదా?” అన్నాడు.

anantudu_3విరజుడికి యక్షిణి శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగావున్న పెద్ద పర్వతాన్ని యక్షిణి శైలం గా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీదవున్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర, దేవనాగారలిపిలో వున్న ఒక శిలా శాసనం వుంది. అందులో, ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్యభాగంలో నిరంతరం వేగంగా తిరిగేసుడి ఒకటున్నది. మంత్రం తంత్ర శాస్త్రజ్ఞాని, సాహసీ, నిస్వార్థ పరుడూ అయిన యువకుడు, ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయిన్చినట్లయితే, అతడికి అష్ట సిద్ధులూ, నవనిదులూ లభిస్తాయి, పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయ బాదుతాడు, అని వున్నది.

సుప్రతీకుడి మాటలో అదంతా గుర్తు తెచ్చుకుని విరజుడు బిక్కముఖం వేసి, “యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి, ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు!” అన్నాడు.

ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, “అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు, ప్రభూ! అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళీ ప్రవత ప్రాంతంలోని కృష్ణ చంద్రుడనే గురూత్తముని వద్ద మంత్రం శాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతలామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్టి ఇంట ఆతిధ్యం పొందారు. ఆ అనంతుడు గొప్ప సాహసి అనీ, ఎన్నదగ్గ నేస్వార్తపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి, రాజ్య క్షేమం కోసం యక్షిణి శైలికి వెళ్ళమని అడుగుదాము. నిధులతో తిరిగి వస్తే, అతడి ఎట్టు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు?” అని అడిగాడు.

అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి పడిన విరజుడు, ఒక్క క్షణం ఆలోచించి, సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది.

అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేసాడు. తర్వాత, యక్షిణిశైలాన్ని గురించి చెప్పిన దంతా శ్రద్ధగా విన్న అనంతుడు, “ప్రభూ! మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేనీ యక్షిణిశైలానికి తప్పక వెళతాను,” అన్నాడు.

అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణిశైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు.

అనంతుడిటో బాటే వెళ్లి, కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి, చాలా సేపు గడిచిన తర్వాత, అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ, కోనేటి నుంచి బయటకిరావడం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గిరకు వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృత గా, “అనంతా! నిధి దొరికిందా, ఏదీ?” అంటూ ప్రశ్నించాడు.

anantudu_4అనంతుడు మందహాసం చేసి, “రండి, చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదం కలగదు!” అని విరజుది చెయ్యి పట్టుకుని మళ్ళీ కోనేటిలో దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవ రత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రం ముగ్దుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, “ప్రభు! నేను సాధించిన ఈ అమూల్యమైన నిదినిక్షేపాల్ని, మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమంకోసం వినియోగించేందుకు, ఈ క్షణమే మీ పరంచేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా, మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు!” అన్నాడు.

ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, “మరేమి కావాలి?” అని ప్రశ్నించాడు? మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం, నన్ను మీ ప్రదానామాత్యుడిగా నియమించుకొంది. అదే నాకు   కావలసింది!” అన్నాడు అనంతుడు గంభీరంగా.

విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా వుండిపోయి, తర్వాత కాళ్ళ నీళ్ళు పెట్టుకుని వంగి అనతుడి పాదాలు స్పృశించి, “మహానుభావా! నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంఛీ నువ్వే నా ప్రధాన మంత్రివి! నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను!” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, నిధి సంపాదనలో, విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే వుంది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడూ, సాహసీ అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనబడుతున్నది. అతడు నిస్వార్థ పరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్లి పోవాలి. లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీ గాక ఇదీ గాక, విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి, మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించు కుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావా, నీ తల పగిలి పోతుంది!” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “అనంతుడు మొదటి నుంఛీ రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థ పరుడు. అందుకే అతడు, భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థ పరుడు కావచ్చు. కాని, అప్పటి పరిస్థితుల్లో, ప్రజల వ్యతిరేకత, ఖజానాలో దానం లేకపోవడం, పొరుగురాజు దండ యాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పగ్నుడి సలహాలు – వీటన్నిటి కారణంగా దేసరక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకం తోనే, అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేసభాక్తిని, రాజకీయ పరిజ్ఞాతాన్నీ చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం. అవివేకం అంటూ ఇందులో ఏ మాత్రం లేదు!” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు.

anantudu_5

Source: Chandamama, February 2004.
 

సత్యపాలుడి కథ

coverపట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా, ఈ రాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదలా, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే, నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వ సాధారణం కాకపోయినా, అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగ పాలించి, ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల వరం చేయాలంటే, అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు, ఏంతో నిలకడ గల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు వుండి, నిలకడగల రాజనీతి, చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్ప సాగాడు.

పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే, అతడు దేశపు యదార్ధ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగ లాలసుదిన చంద్రపాలుడు, పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి, విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతినిని సృష్టుస్తుందన్న దానికి సాక్ష్యంగా, అధికారులలో లంచగొండితనం, మోసబుద్దీ ప్రబలినాయి.

satya_1దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా వుండగా, విదేశాల నుంచి కూడా చందనదేశానికి సమస్యల ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున, చందన దేశాన్న అనుకుని ఒక భిల్లదేసం వున్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు, స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్తా తీసుకుని వచ్చారు. ఇక, తూర్పుదిక్కున భిల్ల దేశాన్ని ఆనుకుని మహిర దేశం వున్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ , చందన దేశం లోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని, దేశాన్ని కబలించాలనే ఆలోచనలో వున్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు.

satya_2ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుసు, ఒకనాడు మహామంత్రి కేవలభట్టుతో మంత్రాంగం సాగించాబోయాడు.

“మహారాజా! అంతరంగిక సమస్యలకంటే, విదేశా సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు. ఇన్న సమస్యలన్నీ చిటికెలో పరిష్కరమవాలంటే, ఒకేఒక్క ఉపాయం వున్నది!” అన్నాడు కేవలభాట్టు.

“ఏమిటది?” అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా.

“మిహిరాధీశుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహమాదినట్లయితే, చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి భిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా, అవసరం అనుకుంటే మనమే అతణ్ణి మట్టుబెట్టి, ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం!” అన్నాడు కేవలభాట్టు.

సత్యపాలుడు ఆశ్చర్యంగా, “అదెలా సాధ్యం, మహామాత్య? ప్రచండవర్మ వియ్యపుటాలోచానలోనే వుంటే, అసలు యుద్ధప్రసక్తే వుండదు కదా?” అన్నాడు.

కేవలభాట్టు క్షణం సంకోచించి, “ఆయనలో ఆ ఆలోచన లేనిమాట నిజమే, మహారాజా! కాని రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని, మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగులుద్వారా ఆమెకు తెలియజేస్తేచాలు! అటునుంచి ఆమే నరుక్కోస్తుంది.” అన్నాడు.

సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి, చిరునవ్వుతో, “మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు, ఆమె అహంకారం గురించి చెప్పలేదా?” అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు మంత్రి కేవలభాట్టు తడబడి, “ఆ మాట నిజమే మహారాజా! కాని ఆమె ఇంకా చిన్నపిల్లెగాడా.” అన్నాడు.

ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి, అంతటితో మంత్రాంగం ముగించాడు.

satya_3తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ, వికలమైన మనస్సుతో, ఒకనాడు సత్యపాలుడు, కాన్చానగిరి పాడంవడ్డ ఆశ్రమ వాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు, ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు.

గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో వున్నదనగా, చిరుతపులి ఒకటి పొదల చాటునుంచి భీకరంగా గాండ్రిస్తూ, సత్యపాలుది గుర్రం మీదికి దూకింది. గుర్రం బెదిరి, సత్యపాలుడు ఎంత ఆపుచేయ్యబోయినా ఆగక, వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట, సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి, ఒక చెట్టు దగ్గిర ఆగింది.

satya_5సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చెయ్యడం కోసం, నేర్వరులైన భిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది! ఆ సంగతి గ్రహించగానే, తను భిల్లరాజ్యపు పోలి మేరాలలో ప్రవేసిన్చానని గ్రహించిన సత్యపాలుడు, పరిసరాలను గమనిస్తూ, నెమ్మదిగా గుర్రం దిగాడు.

ఇంతలో చెట్ల చాటునుంచి, భుజాన విల్లు, బాణాలు ధరించిన నూనూగు మీసాల భిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుడిని సమీపించాడు. సత్యపాలుడు అతణ్ణి పరిశీలనగా చూస్తూ, “నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా?” అని ప్రశ్నించాడు.

ఆ యువకుడు అవునన్నట్టు తలవూపి, బొంగురు గొంతుతో, “మీరీ చాలా అలిసిపోయి వుంటారు. కొద్ది సేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను!” అంటూ వెనుదిరిగి చెట్లు మధ్యకు వెళ్ళాడు.

ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికీ, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికీ ఆశ్చర్యపోయిన సత్యపాలుడు, ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్ది సేపటికి ఆ యువకుడు, ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబెతికాయలో నీళ్ళు తీసుకువచ్చి, సత్యపాలుడికి అందించాడు.

సత్యపాలుడు అవి అందుకుంటూ, “నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం. నాతోబాటు వచ్చేవంటే, నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి ఋణం తీర్చుకుంటాను.” అన్నాడు.

ఆ యువకుడు చిన్నగా నవ్వి, “నేను నా విశి నేరవేర్చాను, అంటే! అందుకు గాను ఏ ప్రతిఫలమూ అవసరం లేదు, వస్తాను!” అంటూ వేల్లిబోయాడు.

వెంటనే సత్యపాలుడు కోపంగా, “నేను సార్వభౌముడిని, మీది సామంత దేశమని తెలిసి, ఈ మాటలు మాట్లాడుతున్నావా?” అని ప్రశ్నించాడు.

యువకుడు ఆగి, “నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని, నాకు తెలుసు! నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే, అలా ఆహాన్కారపూరిటంగా మాట్లాడారు.” అన్నది కీర్తిసేన.

ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ, “అర్ధమైంది, కీర్తిసేనా! బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు.” అంటూ లేచి నిలబడి, “ఇక వెళ్లొస్తాను!” అన్నాడు.

కీర్తిసేన ఒక్క క్షణం తటపటాయించి, “కొంచం ఆగండి. ఇలా నా వెంట రండి.” అంటూ ముందుకు దారి తీసింది.

satya_4ఇద్దరూ కొద్దిసేపు నడిచి, బాగా చదును చేసివున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతిల్తో చేసిన ఆరడుగుల శక్తివిగ్రహం ఒకటి వున్నది.

కీర్తిసేన సత్యపాలుడితో, “ఈమేను స్వయంశక్తి దేవతగా మేం ఆరాధిస్తాం. ఈ దేవత ఆశీర్వాదం వుంటే, అన్ని చిక్కులూ విడిపోతాయని, మా దృఢ విశ్వాసం!” అన్నది.

సత్యపాలుడు, స్వయంశక్తి దేవతకు భక్తీగా నమస్కరించి, రెండు మస్సాలు తర్వాత, ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి, రాజధానికి ప్రయాణమయ్యాడు.

ఆ మర్నాటి నుంచే, అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుబడ్డ ఉన్నతాధికారులు బంధింప బడ్డారు. సత్యపాలుది నాయకత్వంలో సైనికులు జట్టుజట్టుగా చీల దేశంలోని అన్ని రకాల దొంగలనూ బంధించి కారాగారంలో వేసారు.

ఇలా రెండు మాసాలు గడిచాయి. సత్యపాలుడు ముందు చెప్పినట్టే, భిల్లదేసపు పొలిమేరల్లో పురుష వేషంలో వున్న కీర్తిసేనను కలుసుకున్నాడు.

అతడు, ఆమెతో, “కీర్తిసేన! స్వయంశక్తి దేవత దయవల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి. నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా ఋణపడి వున్నాను. నాతోబాటు మా రాజ్యానికి వచ్చి, మహారాణి పదవిని అలంకరించి, నన్ను కాస్త అయిన ఋణ విముక్తుణ్ణి చేయమని కోరుతున్నాను.” అన్నాడు.

కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే, కీర్తిసేన అన్న వీరసేనుడు, అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకుని, తన చెల్లెలను వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు.

మరి కొద్ది రోజుల్లోనే కీర్తిసేనా, సత్యపాలుల వివాహం జరిగింది.

వివాహ సంరంభం ముగిసీ ముగియడంతోనే, మామగారి సైన్యాన్ని కూడా వెంట బెట్టుకుని, మహిరదేశం మీద దండెత్తాడు, సత్యపాలుడు.

satya_6యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి, సత్యపాలుడిని కలుసుకుని, “నాయనా సత్యపాలా! పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు. కాని, నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక, నీ మీద అధిమానం పెంచుకుంది. ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను.” అంటూ దీనంగా కోరాడు.

ఇందుకు సత్యపాలుడు అంగీకరించి, మదూలికను వివాహం చేసుకున్నాడు.

తర్వాత ప్రచండవర్మను తనకు సామంత రాజుగా నియమించి, కీర్తిసేనా మదూలికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, తండ్రి భోగలాలసత కారణంగా, ఆ రాజిక పరిస్థితిలో వున్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం. ఇందుకు రాజనీతి, చతురత అవసరంలేదు. పట్టుదలా, కార్యదీక్షా వుంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగాల రాజనీతి చతురత అవసరం అవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో వున్నట్టు లేదు. చంద్రపాలుడు గడ్డుసమస్యలు కల్పించినట్టుగానే, సత్యపాలుడు రాజనీతి లోపం, అతడి వారసుడికి ప్రమాదకారణం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ, మధూలిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు. తనకు తానై మదూలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించినవాడు, కీర్తిసేన విషయంలో మరొక విషంగా ప్రవర్తించాడు. పోనీ మధూలిక అహంకారి అని తిరస్కరించాదంటే, ఆమెనూ చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే, తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే, సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుదన్న సంగతి, అతడు అధికారానికి వచ్చినప్పటినుంచీ ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. అంతరంగిక సమస్యలు కంటే, పొరుగు రాజులు సృష్ఠించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలభట్ట సలహాలు తోసి పుచ్చాడంలోనే, అతడి రాజనీతి, చతురత వెల్లడవుతున్నది. ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యంపెట్టు! అది రాజుకు స్తానబలాన్ని, అన్గాబలాన్నీ సంపాదించి పెడుతుంది. అది ఎరిగిన వాడు గనకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచాకాన్నీ అణచివేసాడు. భిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే, రాజు ప్రచందవర్మలా అదను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన, తను సత్యపాలుది పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచెందుకే, అతణ్ణి తన దేవి దగ్గరకు తీసుకు వెళ్ళింది. అందువల్లనే మదూలికను తానై కోరి వివాహమాడడానికి నిరాకరించినవాడు, ఆమెను తానై మహారానివి కమ్మని కోరాడు.

అధముల్ని అడిగి అవుననిపించుకోవడమంటే, ఉత్తముల్ని అడిగి లేదని పించుకోవడం మేలన్న సూక్తి అందరేరిగినదే. అహంకారి అయిన మధూలిక, తనకు సత్యపాలుది మీద అభిమానం వున్నా, తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే – తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి, తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో వుంది వుంటుంది. కాని, పరిస్తితుడు మరొకలా పరిణమించడంతో, తండ్రి ప్రార్తనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా, అతణ్ణి వివాహమాడవలసి వచ్చింది.

సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచీ జరిగిందంతా పరిశీలించినప్పుడు, అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక, పరిస్థితుల ప్రభావం బల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిన్చాగల వివేకి కూడా అని తెలుస్తున్నది.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ చెట్టెక్కాడు.

satya_7

Source: Chandamama, August 1992.

వీణాధరి నిర్ణయం

coverపట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో, అర్ధరాత్రి వేల ఈ స్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే, నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే – అసలు నువ్వు సాధించదలచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు, కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేదా? లేక నలుగురిలో నిన్ను అవమానమూ, అపహాస్యాలపాలు చేసేదా? ఎందుకంటే, ఎవరూ తమ స్థాయికి మించిన పనులకు పూసుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా, వీనాధరి అనే ఒక యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పా సాగాడు.

చంద్రశిలా రాజ్యలో రాజయ్యా అనే పేదరైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచేక, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతోపాటు శరీరం మేలిని బంగారంతో తులతూగేలా వుంది. అటువంటి అందాలరాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి, ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు.

అలా నెలలు, సంవత్సరాలూ గడిచి పోతూ, వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ, ఆమె సౌందర్యం మరింత వికసించ సాగింది. అమ్మలక్కలు ఆమెతో, “నీ అద్భుత సౌందర్యం చూసి, ఏ రాజకుమారుదో నిన్ను వివాహమాడుతాడు!” అని హాస్యమాడుతూ వుండేవారు.

ఈ విధంగా వీణాధరి మనస్సులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుదో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది.

Veenadhari_1రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు సివుడనే కొడుకున్నాడు. వీణాధరి పుట్టినప్పతినించి చద్రయ్య, రాజయ్యతో, “నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను!” అంటూ ఉండేవాడు.

వీణాధరి, శివుడు యుక్తివయస్కులయ్యారు. ఒకనాడు, వీనాధరితో, “వీణా! నా మనసులోని మాట చెబుతున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే మన పల్లి జరిగేలా చేస్తాను,” అన్నాడు.

అందుకు వెంటనే వీణాధరి, “ నిన్ను పెల్లాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు.” అన్నది.

ఆ మాటకు శివుడు నొచ్చుకుని, “ఇందులో బలవంతం ఏమి లేదు. నేను మాత్రం నిన్ను తప్ప ఎవ్వరిని పెళ్ళాడను.” అన్నాడు.

ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తనవంటి సామాన్యురాలు రాకుమారుడిని వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక, మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరం అని, ఆమె ఆలోచించింది. ఇందుకుగాను, కొంత కాలం మహారాణికి పరిచారికగా వుంది, అనుభవం గడించడం అవసరం అనుకుంది.

వీణాధరి స్నేహితురాలిన పద్మదీపిక అనే యువతి, మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది. ఆమె ద్వారా, వీణాధరి మాహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది.

Veenadhari_2ఒక సారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, “మహారాణి! నేనొక చిర్తపటం తయారుచేసి, తమకు కానుకగా తెచ్చాను” అన్నాడు.

వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని, మహారాణికి ఇచ్చింది.

ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రిన్చాబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మేలవిమ్పుకు ముగ్దురాలైన చంద్రావతి, చిత్రకారుడికి వేయి వరహాలు బహుమతిగా ఇచ్చింది.

తర్వాత ఆమె వీనాధరిని దగ్గరికి పిలిచి, “ఎలా వుంది చిత్రపటం?” అని అడిగింది.

అందుకు వీణాధరి, “రోజు చూసే సూర్యుడే గదా! అందులో విసేశామేమున్నది. ఏమైనా, దీనికి వేయి వరహాల బహుమతి చాలా ఎక్కువనుకుంటాను.” అని జవాబిచ్చింది.

ఆ మాటకు మహారాణి నవ్వి, “వీణా, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాదేగాని, కళాహృదయం ఇవ్వలేదు. సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లున్దాలన్న సంగతి నువ్వేరగావా?” అన్నది.

Veenadhari_3ఒక రోజు మహారాణి, మహారాజూ తమ మందిరంలో కూర్చుని వుండగా, వీణాధరి వింజామర వీస్తున్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి, “మహారాజా! వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుత్త పరిచాడు. ఆది ఏ క్షణాన అయినా జరగవచ్చు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో పంపిస్తూ, వింజామార వీచడం మరిచిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.

మహారాజు, ఆమెతో, “శక్తిసింహుడు దాడి చేయవచ్చు గాని, అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నడీ తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే వుంది!” అని వీణాధరి కేసి తల తిప్పి చూసి, “అంతః పురంలోని వాళ్ళే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే, ఇక సామాన్యులు మాటేమిటి? ధైర్యంగా వుండడం నేర్చుకో.” అన్నాడు.

ఒక నాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే, వీణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం – మహారాణి లేనప్పుడు, ఆమె నగలు అలంకరించుకుని, అద్దంలో చూసుకోవాలన్న కోరిక, వీనాదరికి చాలా కాలంగా వున్నది.

మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వీణాధరి, ఆమె పట్టువస్త్రాలు, నగలు ధరించి, అద్దం ముంది నిలబడింది.

అంతలో ఒక యువకుడు, అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, “సుందరీ! ఎవరు నువ్వు?” అని ప్రశ్నించాడు.

Veenadhari_4సాధారణమైన దుస్తులు ధరించివున్న, ఆ యువకుణ్ణి చూసి వీణాధరి, అతణ్ణి ఆటపట్టిన్చాలనుకుని, “నేను శక్తిపురి రాజ్య యువరాణిని. ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను” అన్నది హుందాగా.

అందుకు యువకుడు, “నేను రాజ్యం యువరాజు విజయదీపుడిని. విద్యాభ్యాసం ముగించుకుని, ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుదిని చేసింది. నీకు సమ్మతమైతే, పెద్దల అంగీకారంతో మన వివాహము జరిగేలా చూస్తాను,” అన్నాడు.

ఇది విని వీణాధరి, తను పరిహాసమాదించిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించించింది. మరుక్షణం ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించింది. “యువరాజులు క్షమించాలి! నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాన్చాల్యముతోనూ, మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను. నా తప్పు క్షమించండి!” అని వేడుకున్నది.

నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో, “భయపడకు! నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలనేగాని కాలదన్నిపోను. నువ్వు పరిచారికవైనా, పరిణయమాడ దలిచాను.” అన్నాడు.

ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, “యువరాజా! మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమాతిన్చాకపోతే, ఏం చేస్తారు?” అన్నది.

ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. “యువరాజంత వాణ్ణి అడిగితె, ఏ యువతి కాదనగలడు? నువ్వు అంగీకరించకపోతే, అందుకు కారణం నువ్వు వట్టి ఆహాన్కారివైన అయి వుండాలి, లేదా మూర్ఖురాలైనా అయి వుండాలి. అలా అయిన పక్షంలో నేను, నిన్ను మించిన అందగత్తెను వివాహమాదగాలను.” అన్నాడు.

ఆ వెంటనే వీణాధరి, “క్షమించండి, యువరాజా! నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం, వివాహం మరొకరితో, ఏనాడో నిశ్చయమైపోయింది.” అని అక్కడ నుంచి బయలుదేరి, గ్రామచేరి, తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచీ రాజకుమారుడిని వివాహమాడాలని కలలు కన్నది కదా! ఆ కళలు నిజమవుతున్న క్షణంలో, చేజేతులా జారవిడుచుకోవడానికి కారణం ఏమిటి? తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించడం వల్లనా? మహారాణి, ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు, ఆమెకు ధైర్యంగా వుండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక, వీణాధరి తన స్థాయికి, శక్తిసామర్థ్యాలకు మించిన కార్యం సాధించావూనానని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “వీణాధరి, యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్నా కళలు వాస్తవం చేసుకున్నాక, ఇక స్థాయి, శక్తిసామర్థ్యాలు ప్రసక్తే వుండదు. ఆమె, యువరాజును అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే, ఆమె అతణ్ణి వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహమంగీకరించాకపోతే – ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాదగాలనన్నాడు, యువరాజు. దీని అర్ధమేమిటంటే – ఏదో ఒకనాడు వీనధరిని మించిన సౌందర్యవతి కంట బడితే, యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలదు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే, ఆమె తన పగటికలలకు స్వప్తి చెప్పి, తననేన్తగానో ప్రేమిస్తున్న, తండ్రి స్నేహితుడి కొడుకైనా శివుణ్ణి వివాహమాడింది.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరి చెట్టెక్కాడు.

Veenadhari_5

Source: Chandamama, July 1992.

మారిన రూపాలు

coverపట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, అర్ధరాత్రి సమయంలో, నీ మందిరంలో పట్టుపాన్పుపై నిశ్చింతగా నిద్రపోవలసిన నువ్వు, ఇంత భీతగోల్పే శ్మశానంలో, నానా ఇక్కట్లకూ లోనవుతూండడం చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఎంతటి వివేకవంతులూ, ఒక్కొక్కసారి తమ వ్యక్తిగతమైన అతి ముఖ్య విషయాల గురించి, వివేకహీనుల్లా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వాటికి కారణాలు వేదికిపెట్టడం సాధ్యపడే పని కాదనుకుంటాను! ఇందుకు ఉదాహరణగా, తనను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక యువతి పట్ల, మాళవదేశ యువరాజు ప్రవర్తించిన తీరు యెంత అసందర్భంగా, అవివేకంగా ఉన్నదో చెబుతాను, శ్రమ తెలియకుండా వినే.” అంటూ ఇలా చెప్పా సాగాడు:

మాళవ దేశాన్ని పాలించే వీరసిమ్హుడు వ్రుద్దుడైపోయాడు. ఆయన ఏకైక పుత్రుడు సూర్యవర్మ. సూర్యవర్మ యుక్తవయస్కుదయ్యాడు. కుమారుడికి త్వరలో వివాహం జరిపి, పట్టాభిషేకం చేస్తే తన బాధ్యతా తీరిపోతుందని భావించాడు మాహారాజు. యువరాజు వివాహ విషయంలో తగిన కన్య కోసం అన్వేషణ జరపవలసిన అవసరం కూడా లేదు. కుంతలా దేశపు యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్న వాళ్ళు. చంద్రప్రభ తండ్రి వాళ్ళ వివాహానికి ఏనాడో అంగీకరించాడు. అయితే ఆస్థాన పురోహితుడు ఏడాదిగా జాప్యం చేస్తున్నాడు.

MaarinaRoopalu_1ఇలా వుండగా ఒక నాడు సూర్యవర్మా, తన విదూశాకుడిని వెంటపెట్టుకుని రథంలో విహారానికి బయలుదేరాడు. రథం ఒక అరణ్య మార్గాన ప్రయాణం చేస్తోంది. చుట్టూ రకరకాల వృక్షాలు, అడవి జంతువులూ చేసే శబ్దాలు, పక్షుల కిలకిలా రావాలు – సూర్యవర్మకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్నది. మధ్య మధ్య విదూషకుడు తన చలోక్తులతో అతడిని నవ్విస్తున్నాడు.

ఈ విధంగా సూర్యవర్మ సూర్యాస్తమయ వేళ వరకూ అరణ్యంలో తిరిగి, చీకటి పడుతూండగా సారధిని రథం వెనక్కి తిప్పి నగరానికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు. సారాషి బాగా చీకటి పడక ముందరే నగరం చేరాలని, అశ్వాలను గట్టిగా అదిలించాడు. అవి వాయువేగంతో ఎట్టు పల్లాలుగా వున్న అరణ్య మార్గాన పరిగెత్త సాగాయి.

MaarinaRoopalu_2ఇంతలో హఠాత్తుగా మార్గానికి కొద్ది దూరం నుంచి ఏనుగుల ఘీంకారం వినిపించింది. అది వింటూనే రథాశ్వాలు రెండూ బెదిరిపోయి, రథాన్ని మార్గం నుంచి పక్కకు లాగి, చెట్లు మధ్యగా తమకు ఇష్టమొచ్చినట్టు పరిగెట్టసాగాయి. సారథి వాటిని అదుపు చెయ్యలేకపోయాడు.

సూర్యవర్మ, విదూశాకుడూ, ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు కొంతసేపటికి తేరుకుని, రథం నుంచి కిందికి దూకడం క్షేమమా కాదా అని ఆలోచిస్తున్నంతలో, రథచక్రం ఒకటి చేట్టుబోదెను దీకున్నది. దానితో రథం పక్కనున్న పల్లంలోకి ఒరిగింది. విదూశాకుడూ, సారథీ దాపులవున్న పొదల్లో పడ్డారు. సూర్యవర్మ పొడలనానుకుని వున్న ఒక సరస్సులో పడిపోయాడు.

MaarinaRoopalu_3కొంతసేపటికి, తడిసిన దుస్తులతో చలికి వణుకుతూ సూర్యవర్మ సరస్సునుంచి లేచి వచ్చాడు. శరీరం మీద చిన్న చిన్న గాయాలతో చిరిగినా దుస్తులతో పొడలనుంచి లేచి బయటికి రాబోతున్న సారథి, విదూషకుడు, సూర్యవర్మ కేసి చూస్తూ ఒక క్షణం నివ్వెరపోయారు.

అది గమనించిన సూర్యవర్మ, వాళ్ళను, “ఏమిటలా నాకేసి వింతగా చూస్తూ, స్థాణువులా నిలబడిపోయారు?” అని ప్రశ్నించాడు.

అయితే, వాళ్ళు జవాబిచ్చే ముందే సూర్యవర్మ నిలువెల్లా కంపించిపోయాడు. అందుక్కారణం, ఉరుము లాంటి అతడి కంఠస్వరం కోమలంగా వీణ మీటినటుండడమే! అతడు తన శరీరాన్ని ఆపాద మస్తకం ఒకసారి పరీక్షగా చూసుకున్నాడు. చీర, రవిక, చేతులకు గాజులు, కాళ్ళకు అందెలు! చేసిన సాముగరిడీల వల్ల ఉక్కులా వుండే అతడి శరీరం ఎంతో సుకుమారంగా మారిపోయింది.

దానితో సూర్యవర్మకు సారథి, విదూశాకుడూ తనకేసి అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో అర్ధమయ్యింది. ఆ సరస్సులో ఏదో మహత్యం వున్నదని, ఆ కారణంగానే తనకు స్త్రీ రూపం వచ్చిందని అతడు గ్రహించాడు.

తర్వాత ముగ్గురూ మౌనంగా, పల్లంలో ఒరిగివున్న రథాన్ని పైకి లాగి, ఆ రాత్రి తొలిజాము గడిచే సమయానికి నగరం చేరారు.

తమ కుమారుడు ఆడపిల్లగా మారిపోయాడని తెలుసుకుని, రాజడంపుతులు ఎంతగానో విశారించారు. తెల్లవారేసరికి ఈ వార్తా దావానలంలో మాళవరాజ్యమంతటా పాకిపోయింది.

“మన సూర్యవర్మ కాస్తా, సూర్యప్రభాగా మారిపోయాడు!” అంటూ నగర్ పౌరులు తమలోతాము హాస్యమాడుకో సాగారు.

సూర్యవర్మ సిగ్గుతో, ఆ రోజంతా తన భవనం నుంచి బయటికి రాలేదు.

శరీరం స్త్రీత్వం సంతరించుకున్నా, సూర్యవర్మ మనస్సు మాత్రం అందుకు అనుగుణంగా మారలేదు. మనసేమో పూర్వపు సూర్యవర్మలా ఆలోచించేది! ఆకారం స్త్రీది, ఆలోచనాదోరణి పురుషుడిది! ఇలాంటి సంఘర్షణతో సతమతమైసాగాడు, సూర్యవర్మ.

ఒకనాడు రాజు వీరవర్మ, ఆస్థాన దైవగ్నుడిని తన కుమారుడి విషమ సమస్యకు పరిష్కారమార్గం ఏదైనా ఆలోచిన్చావలసిన్డిగా కోరాడు.

MaarinaRoopalu_4అందుకు దైవజ్ఞుడు, “మహారాజా! మన రాజధానికి ఈశాన్య దిశలో గల మహారణ్యంలో, ఒక మాయసరస్సున్నది. దాని ఉనిక బహుకోద్దిమందికి మాత్రమే తెలుసు. ఒకానొక యక్షుడి శాప కారణంగా, అందులో అడుగుపెట్టిన పురుషుడు స్త్రీగాను, నత్రీ పురుషుడుగానూ మారిపోతారు. యువరాజు ప్రమాదవశాన అందులో పాడడం జరిగింది. అది విధి దుష్కృతం అని సరి పెట్టుకోవాల్సిందే తప్ప చేయగలిగిందేమీ లేదు.” అన్నాడు/

రాజు వీరవర్మ, దైవజ్ఞుడు చెప్పింది విని ఎంతగానో కృంగిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లో చేయవలసిందేమిటో బాగా అలోచించి, ఒక వర్తాహారుడి ద్వారా కుంతలరాజుకు, “మహారాజా! నా కుమారుడు సూర్యవర్మ ఎంతటి విధి వైపర్యానికి లోనుకావలసి వచ్చిందో వినే వుంటారు. ఆ కారణంగా, యువరాజు, చంద్రప్రభను వివాహమాడడానికి యోగ్యుడు కాదు!” అని తెలియ పరిచాడు.

అందుకు ప్రత్యర్తంగా యువరాణి చంద్రప్రభ, సూర్యవర్మకు ఒక లేఖ రాసి వార్తాహరుడి ద్వారా పంపింది. అందులో ఆమె, “యువరాజా! తమకు ఆమోద యోగ్యమైతే, ఆ మాయా సరస్సులో దిగి నేను పురుషుడుగా మారతాను. అప్పుడు మనిద్దరం భార్యా భర్తలు కావడానికి ఎలాంటి ఆటంకము వుండదు” అని రాసింది.

ఆ లేఖను సూర్యవర్మ చదివి, తల్లి తండ్రులకు ఇచ్చాడు. వాళ్ళు యువరాణి చంద్రప్రభ అభిప్రాయం తెలుసుకుని, సూర్యవర్మతో, “నాయనా౧ ఈ లేఖద్వారా, చంద్రప్రభ నిన్నెంత గాఢంగా ప్రేమించిందో అర్ధమవుతోంది. ఆమె చెప్పింది నీకు అంగీకారమే కదా?” అని అడిగారు.

అందుకు స్త్రీ రూపంలో వున్న సూర్యవర్మ కొంత సేపు ఆలోచించి, “చంద్రప్రభ అభిప్రాయం నాకు అంగీకారం కాదు. నేనదుకు అంగీకరించడమంటే, మరిన్ని జాతిల సమస్యల వలయంలో చిక్కుకుపోవడం అవుతుంది. తనకు యోగ్యుడుగా తోచిన రాకుమారుడిని వివాహమాడి, సుఖ పాడమని చంద్రప్రభకు ఈ రోజే లేఖ రాసి పపుతాను.” అన్నాడు.

బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా! సూర్యవర్మ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకునాదన్న విషయం గురించి, కార్య కారణం సంబంధాలను వేదకజూడడం వృధా శ్రమే అవుతుందికదా? అలా కాదనుకుంటే, అతడు కించిత్తు వివేకం కూడా లేని అహంభావి అని సరి పెట్టుకోవచ్చు. పురుషుడుగా మారిన చంద్రప్రభకు తను భార్యగా అణిగి మణిగి ఉండవలసి వస్తుందన్న ఆలోచన, అతతడిలో మితిమీరిన అహాన్ని రేకేట్టించు వుండాలి. ఒక వేల అతడు చంద్రప్రభను ప్రేమించిన మాట నిజమైతే, మరొకరిని వివాహమాడమని ఆమెకు లేఖ రాయలేదు గదా? ఏది ఏమైనా సూర్యవర్మ ప్రవర్తన వివేక హీనగాను, అసందర్భంగాను లేదా? ఈ సదేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలి పోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “సూర్యవర్మ నిర్ణయానికి మూలకారనమేమితో గ్రహించడం సులువైన పని. దాని కార్యకారణ సంబంధాలు తెలుస్తూనే వున్నవి. స్త్రీ రూపంతో, పురుషుడు మనస్సుతో, జీవించడం అంటే ఎంతటి చిత్రహింసకు గురి కావలసి వస్తుందో, అతడికి తెలుసు. ఒక వేల యువరాణి చంద్రప్రభ సరస్సు దిగి పురుశారూపంలోకి మారినా, ఆమె కూడా తన లాగే మానసిక యాతనకు గురికావలసి వస్తుంది. చంద్రప్రభను ఎంతగానో ప్రేమించిన సూర్యవర్మ, జీవితాంతం ఆమెను అలాంటి బాధకు గురిచేయ్యలేదు. ఆ కారణంగానే అతడు, ఆమె సలహాను తోసిపుచ్చాడు. అంతేతప్ప, ఆ నిర్ణయంలో అవివేకంగాని, అసందర్భంగాని, పురుశాహన్కారంగానీ ఏమిలేదు.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ గానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్కాడు.

ending

Source: Chandamama, June 1992

ఎలుక ఆకలి

shutterstock_465953222

Image: Ritu Jagya / Shutterstock.com

అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది.

వెతకగా, వెతకగా, ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి, చిన్న కన్నం ఏర్పడి వుంది – అది కనిపించింది.

“అమ్మయ్య!” అనుకుని, ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్లి, బోకా బోకా పొత్తులు తినడం మొదలెట్టింది.

అంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే వుంది. కొంచం సేపటికి కడుపు ఉబ్బి, బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంక చాలు, బయట పడదాము అని ఎలుక మళ్ళీ కన్నం లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది.

లోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేక పోయింది. ఎందుకంటే వెళ్ళే డప్పుడు సన్నంగా వుంది. ఇప్పుడు తిని, తిని, కడుపు ఉబ్బి లావయి పోయింది. ఆ కన్నంలో ఇంక పట్టటం లేదు.

“ఇప్పుడెల?” అని ఖంగారు పడుతూ చాలా ఆలోచించింది.

అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలుని సహాయం అడిగింది.

కుందేలు, “ఇంకేం చేస్తావు, తిన్నదంతా అరిగి, మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు అదే విధంగా సునాయాసంగా బయటి వస్తావు” అని సలహా ఇచ్చింది.

ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు వున్నా, తిన కుండా, బాగా ఆకలి వేసి, పొట్ట మళ్ళీ లోపలి వెళ్ళే దాకా ఆగి, ఆ రంద్రంలోంచి బయట పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసారినికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.

మూడు వరాలు

shutterstock_487525618

Ritu Jagya/Shutterstock.com, used under license from shutterstock.com. Please do not copy or reproduce.

చాలా రోజుల క్రితం ఒక పల్లెలో ఒక రైతు, అతని భార్య ఉండేవారు.

ఇద్దరూ పొలం పనులు చేసుకుంటూ చాలా కష్ట పడేవారు, కాని యెంత కష్ట పడ్డా బీదరికం తప్పలేదు.

ఒక రోజు పొలం దున్నుతుంటే ఒక బండకి పార తగిలి బద్దలయ్యింది. ఆ బండలో బందీ అయిన ఒక దేవతకి శాప విముక్తి కలిగింది.

ఏంతో కాలంగా రాయి లో ఇరుక్కుపోయి మొత్తానికి ముక్తి చందిన దేవత కృతజ్ఞత తెలుపుకుంటూ రైతుకి, అతని భార్యకి కలిపి మూడు వరాలు ప్రసాదించింది.

భార్య రైతుతో, “డబ్బు అడుగుదాము, డబ్బు ఉంటే అన్నీ అవే సద్దుకుంటాయి” అంది.

రైతు, “వద్దు! హటాత్తుగా అంత డబ్బు వస్తే దొంగలు పడి దోచుకెళ్ళి పోతారు, మనం జాగ్రత్తగా ఆలోచించి వరాలు అడుగుదాము” అన్నాడు.

అలాగే దేవత వాళ్లకు ఒక్క రోజు గడువు ఇచ్చింది.

ఆ రోజు సాయంత్రం భోజనానికి కూర్చున్నప్పుడు పెళ్ళం రైతుతో, “డబ్బే అడగాల్సింది. ఈ రోజు చక్కగా నాటుకోడి కూర తింటే యెంత బాగుండేది!” అని నిట్టూర్పుతో అంది.

వెంటనే వాళ్ళ పళ్ళాలు నాటుకోడి కూరతో నిండి పోయాయి.

రైతు కోపంగా, “అనవసంగా ఒక వరం పాడు చేసావు! ఇప్పుడా కోడికూర నీ ముక్కులో పెట్టుకో!” అని తిట్టాడు.

వెంటనే కూర ఆమె ముక్కులో పోయి ఇరుక్కుంది. ఇద్దరు భయ పడి పోయారు. వెంటనే ముక్కులోంచి కోడి ముక్కలు పోవాలని కోరుకున్నారు. అలాగే కూర ముక్కలు ముక్కులోంచి మాయం అయిపోయాయి.

అలా ఆలోచించ కుండా నోటికి వచ్చింది అనేసి ఇద్దరు మూడు వరాలనీ వేస్టు చేసుకున్నారు. ఆ తరువాత తల పట్టుకుని బాధ పడితే మట్టుకు ఏమి లాభం!

ఎలుగుబంటి చెప్పిన రహస్యం

Two friends and a bear

ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితేకాని పొరుగూరికి చేర లేరు. అడవిలో రక రకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు.

అనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగూరికి బయలుద్యారారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే, హటాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది.

వెంటనే ఇద్దరూ భయ పడిపోయారు.

“ఏం చేద్దాం?” అనుకున్నారు.

మొదటివాడు “చెట్టు ఎక్కేద్దాము,” అని సలహా ఇచ్చాడు.

“కాని నాకు ఎక్కడం రాదే!” అని రెండో వాడు అన్నాడు.

“నాకు వచ్చు కదా” అని మొదటి వాడు చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు.

రెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? మొదటి వాడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు!

వెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుక్కున్నాడు. చడి చప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు.

ఎలుగుబంటి దగ్గిరకి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకుని అలాగే స్థిరంగా వున్నాడు. ఎలుగుబంటి చని పోయిన జీవులని తినదు. అలా కదలకుండా పడివున్న రెండో వాడు చనిపోయాడనుకుంది. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసి కొంత సేపటికి వదిలి వెళ్ళిపోయింది.

ఎలుగుబంటి వెళ్ళిపోయాక రెండో వాడికి ఉపశమనం కలిగింది. హమ్మయ్య! అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు.

మొదటి వాడు చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటి వాడు అపోహ పడ్డాడు.

“ఎలుగుబంటి నీకు అంత సేపు చెవిలో ఏమి చెప్పింది” అని అడిగాడు.

“అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు, అని నాతొ ఎలుగుబంటి చెప్పింది” అని రెండో వాడు జవాబు చెప్పాడు.

Image composed from various sources including Ritu Jagya/Shutterstock.com and free Bing Clip Art. Copyright violations are unintentional and image will be removed if you let me know.

కోతుల టోపీలు

shutterstock_476785555

ఒక టోపీలు అమ్ముకునే అతను ఉండేవాడు. అతను అన్ని ఊళ్లూ తిరుగుతూ, అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు.

ఒక రోజు అలాగే వ్యాపార పరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది. మండుతున్న సూర్యుడు, భగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

దారిలో ఒక చెట్టు నీడలో ఆగి, తెచ్చుకున్న భోజనం తిని, మంచినీళ్ళు తాగి, తన టోపీల బస్తా పక్కన పెట్టుకుని, చెట్టు నీడ లో హాయిగా నిద్రపోయాడు.

కొంచం సేపటికి లేచి చూస్తే బస్తా లో ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేసారు. ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది. పైకి చూస్తే చెట్టు నిండా కోతులు ఉన్నాయి. ఊరికే ఉన్నాయా? ఒకొక్క కోతి తల మీదా ఒకొక్క టోపీ వుంది.

ఓహో ఇదా సంగతి అని టోపీలు అమ్ముకునే అతను “నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి” అని కోతులతో అన్నాడు.

అవి మాట వినే రకమా? గమ్మున కూర్చున్నాయి.

కోపంగా అతను అరిచాడు.

అవీ తిరిగి అరిచాయి.

చప్పట్లు కొట్టాడు.

అవీ కొట్టాయి.

ఒక రాయి విసిరాడు.

కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయి.

కొడతానని బెదిరించాడు.

కోతులు నవ్వాయి.

చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి, ఇంకో చేత్తో తల గోక్కున్నాడు.

కోతులూ అలాగే చేసాయి.

ఠప్పున ఐడియా వచ్చి, తన చేతిలో వున్న టోపీ నేల మీదకి విసిరే సాడు.

వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న తోపీలను నేల మీదకు విసిరేశాయి.

టోపీలు అమ్ముకునే అతను గబ గబా ఆ టోపీలన్నీ మళ్ళి బస్తాలో వేసేసుకుని, వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగున పారిపోయాడు!

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce