Tag Archives: telugu books

ఎద్దు గర్వం

ఒక ఊరి లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, మూగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించేవారు.

ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు.

మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహ! చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు.

ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి, బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.

ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి, నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడనుకోండి!

ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు.

విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది? అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపాయి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు.

అప్పుడు రాముడికి అర్ధమయ్యింది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.

పంది భయం పందిది !

ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది.

గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది.

ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు. అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది.

అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది: “ఎందుకు అంత గోల పెడుతున్నావు? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము”

వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి.

దానికి పంది ఇలా జవాబు చెప్పింది. “మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి, మేతకు తీసుకువెళ్లి, మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా? నన్ను వొండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో? నా భయం నాకు ఉంటుంది కదా!” నిజమే. ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహస మంతుల లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి.

పిచుక గుణం

sparrow and crows

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

దేవుడే కాపాడుతాడు!

అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.

ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు.

అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది.

ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.

అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”

ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు.  ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.

ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.

కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.

చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.

“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.

పూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.

కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.

పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.

రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో

shutterstock_551670577అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు.

“నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు.

వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజు మహాలుకి తీసుకుని వెళ్ళారు.

మొన్నాడు నేసాధిపతిని పిలిచి, “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు.

రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు.

వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు” అన్నారు.

“మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని” అని వ్యాపారస్తుడు చెప్పాడు.

రాజుగారికి చాలా కోపం వచ్చింది. “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. “ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు.

ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, “మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా!” అన్నారు.

మహారాజు వెంటనే, “ఇతని తల నరికేయండి!” అని ఆదేశించారు.

ఇలా ఒక్కొక్కరినీ పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించ మానడం; వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి.

మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచే, రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆజ్ఞాపించారు.

సభికుడు తల వంచి, “అలాగే మహారాజా! నాకు ఒక సంవత్సరం గడువు ఉవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను!” అని ఒప్పుకున్నాడు.

రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. “ఎలా ఒప్పుకున్నావు? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది? నీ దెగ్గిర ఏమైనా ఉపాయముందా?” అని రక రకాల ప్రశ్నలు అడిగారు. సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో వున్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా ఆటను ఇంటికి వచ్చే దాకా గుమ్మం మీద కాపు కాసింది. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.

సభికుడు నిజమే కానీ ఖంగారు పడద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు – “మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహారాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేసారూ. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది.

ఒక సంవత్సరం గడువు అడిగితే వెంటనే ముందరున్న ప్రమాదం తొలిగింది కదా! ఆ పయిన చూద్దాం! యాడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు! లేదా పట్టుదల తగ్గవచ్చు! భవిష్యత్తు ఎవరు చూసారు? రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో!”

లండన్ దా, అమెరికాదా?

శీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా జేరాడు.

ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికి అతను యెంతో ధనవంతుదని, ప్రపంచమంతా చూసాడని తెలియాలని బాగా తపన పడేవాడు.

ఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శీను ని పిలిచి, “శీను, వెళ్లి దుర్భిణి పట్టుకురా!” అన్నాడు. దుర్భిణి అంటే బైనాక్యులర్స్. శీను లోపలి వెళ్లి అడిగినట్లే దుర్భిణి తెచ్చి ఇచ్చాడు.

వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఆ ధనవంతుడు శీనూను పిలిచి తిట్టాడు. “దుర్భిణి తెమ్మంటే తెచ్చేయడం కాదు! యే దుర్భిణి, లండన్ దా అమెరికా దా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుదినో అందరికి తెలిసేది?” అన్నాడు.

శీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేస్తాను సారూ” అన్నాడు.

కొన్ని రోజుల తరవాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్ లో వున్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు.

ధనవంతుడికి అలవాటే కదా, బడాయిలు చెప్పుకుంటూ, “ఇది మా నాన్న గారు వేట కి వెళ్లి చంపిన పులి!” అంటూ, శీనుని పిలిచి, “మా నాన్నగారి ఫోటో వుండాలి తీసుకుని రా!” అన్నాడు.

వెంటనే అమాయకపు శీను, “యే నాన్నగారు సారూ, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?” అని అడిగాడు!

యే జాతికీ చందలేని గబ్బిలాలు

ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి.

ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.

ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.

యుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.

ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.

యుద్ధం ముగిసి పోయింది.

కాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.

పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కారించాయి.

యే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి.

కాకి హంస కాగలదా?

shutterstock_438665143

ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళు కునేది. వాటి తెల్లటి రెక్కలని, అందమైన రూపాన్ని చూసి కాకి బాధ పాడేది. ఎప్పుడు “నేనూ అలా వుంటే బాగుండేది! ఇలా నల్లగా వున్నాను” అనుకుంటూ వుండేది.

ఒక రోజు కాకికి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది. హంసల లాగానే తనూ నీళ్ళల్లో ఉంటూ, వాటిలా కలుపు మొక్కలు తింటూ, చెరువులో ఈత కొడుతూ వుంటే అదీ చాలా అందంగా అయిపోతున్దనుకుంది ఆ పిచ్చి కాకి.

మొన్నాటి నుంచి నానా ప్రయత్నాలు చేసింది. గాలిలో ఎగరడం మానేసి నీళ్ళల్లో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది. కాని కాకికి ఈత రాదు కదా!

అలవాటు లేని కాలుకు మొక్కలు తింటే అవి పడక, తినలేక, పాపం కాకి చిక్కి సల్యమయిపోయింది.

అయినా పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది.

కాని అందంగా తయారవడము కాదు కదా, ఉన్న బలం కూడా కోలి పోయింది.

ఇంక ఇది లాభం లేదని, అలవాట్లు మార్చినంత మాత్రాన్న రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయ పాడడం మానేసింది.

Image: Ritu Jagya/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

 

బాటసారుల అదృష్టం

travelers luck

అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.

దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి!

“నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు.

“నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు.

“అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు.

రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు.

ఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు!

“అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు.

“మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.

మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా!

Image: Igor Malovik/Shutterstock.com, used under license from Shutterstock.com. Please do not copy or reproduce.

 

సత్యపాలుడి కథ

coverపట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు,”రాజా, ఈ రాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదలా, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే, నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వ సాధారణం కాకపోయినా, అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగ పాలించి, ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల వరం చేయాలంటే, అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు, ఏంతో నిలకడ గల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు వుండి, నిలకడగల రాజనీతి, చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ ఇలా చెప్ప సాగాడు.

పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే, అతడు దేశపు యదార్ధ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగ లాలసుదిన చంద్రపాలుడు, పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి, విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతినిని సృష్టుస్తుందన్న దానికి సాక్ష్యంగా, అధికారులలో లంచగొండితనం, మోసబుద్దీ ప్రబలినాయి.

satya_1దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా వుండగా, విదేశాల నుంచి కూడా చందనదేశానికి సమస్యల ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున, చందన దేశాన్న అనుకుని ఒక భిల్లదేసం వున్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు, స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్తా తీసుకుని వచ్చారు. ఇక, తూర్పుదిక్కున భిల్ల దేశాన్ని ఆనుకుని మహిర దేశం వున్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ , చందన దేశం లోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని, దేశాన్ని కబలించాలనే ఆలోచనలో వున్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు.

satya_2ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుసు, ఒకనాడు మహామంత్రి కేవలభట్టుతో మంత్రాంగం సాగించాబోయాడు.

“మహారాజా! అంతరంగిక సమస్యలకంటే, విదేశా సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు. ఇన్న సమస్యలన్నీ చిటికెలో పరిష్కరమవాలంటే, ఒకేఒక్క ఉపాయం వున్నది!” అన్నాడు కేవలభాట్టు.

“ఏమిటది?” అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా.

“మిహిరాధీశుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహమాదినట్లయితే, చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి భిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా, అవసరం అనుకుంటే మనమే అతణ్ణి మట్టుబెట్టి, ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం!” అన్నాడు కేవలభాట్టు.

సత్యపాలుడు ఆశ్చర్యంగా, “అదెలా సాధ్యం, మహామాత్య? ప్రచండవర్మ వియ్యపుటాలోచానలోనే వుంటే, అసలు యుద్ధప్రసక్తే వుండదు కదా?” అన్నాడు.

కేవలభాట్టు క్షణం సంకోచించి, “ఆయనలో ఆ ఆలోచన లేనిమాట నిజమే, మహారాజా! కాని రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని, మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగులుద్వారా ఆమెకు తెలియజేస్తేచాలు! అటునుంచి ఆమే నరుక్కోస్తుంది.” అన్నాడు.

సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి, చిరునవ్వుతో, “మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు, ఆమె అహంకారం గురించి చెప్పలేదా?” అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు మంత్రి కేవలభాట్టు తడబడి, “ఆ మాట నిజమే మహారాజా! కాని ఆమె ఇంకా చిన్నపిల్లెగాడా.” అన్నాడు.

ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి, అంతటితో మంత్రాంగం ముగించాడు.

satya_3తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ, వికలమైన మనస్సుతో, ఒకనాడు సత్యపాలుడు, కాన్చానగిరి పాడంవడ్డ ఆశ్రమ వాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు, ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు.

గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో వున్నదనగా, చిరుతపులి ఒకటి పొదల చాటునుంచి భీకరంగా గాండ్రిస్తూ, సత్యపాలుది గుర్రం మీదికి దూకింది. గుర్రం బెదిరి, సత్యపాలుడు ఎంత ఆపుచేయ్యబోయినా ఆగక, వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట, సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి, ఒక చెట్టు దగ్గిర ఆగింది.

satya_5సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చెయ్యడం కోసం, నేర్వరులైన భిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది! ఆ సంగతి గ్రహించగానే, తను భిల్లరాజ్యపు పోలి మేరాలలో ప్రవేసిన్చానని గ్రహించిన సత్యపాలుడు, పరిసరాలను గమనిస్తూ, నెమ్మదిగా గుర్రం దిగాడు.

ఇంతలో చెట్ల చాటునుంచి, భుజాన విల్లు, బాణాలు ధరించిన నూనూగు మీసాల భిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుడిని సమీపించాడు. సత్యపాలుడు అతణ్ణి పరిశీలనగా చూస్తూ, “నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా?” అని ప్రశ్నించాడు.

ఆ యువకుడు అవునన్నట్టు తలవూపి, బొంగురు గొంతుతో, “మీరీ చాలా అలిసిపోయి వుంటారు. కొద్ది సేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను!” అంటూ వెనుదిరిగి చెట్లు మధ్యకు వెళ్ళాడు.

ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికీ, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికీ ఆశ్చర్యపోయిన సత్యపాలుడు, ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్ది సేపటికి ఆ యువకుడు, ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబెతికాయలో నీళ్ళు తీసుకువచ్చి, సత్యపాలుడికి అందించాడు.

సత్యపాలుడు అవి అందుకుంటూ, “నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం. నాతోబాటు వచ్చేవంటే, నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి ఋణం తీర్చుకుంటాను.” అన్నాడు.

ఆ యువకుడు చిన్నగా నవ్వి, “నేను నా విశి నేరవేర్చాను, అంటే! అందుకు గాను ఏ ప్రతిఫలమూ అవసరం లేదు, వస్తాను!” అంటూ వేల్లిబోయాడు.

వెంటనే సత్యపాలుడు కోపంగా, “నేను సార్వభౌముడిని, మీది సామంత దేశమని తెలిసి, ఈ మాటలు మాట్లాడుతున్నావా?” అని ప్రశ్నించాడు.

యువకుడు ఆగి, “నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని, నాకు తెలుసు! నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే, అలా ఆహాన్కారపూరిటంగా మాట్లాడారు.” అన్నది కీర్తిసేన.

ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ, “అర్ధమైంది, కీర్తిసేనా! బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు.” అంటూ లేచి నిలబడి, “ఇక వెళ్లొస్తాను!” అన్నాడు.

కీర్తిసేన ఒక్క క్షణం తటపటాయించి, “కొంచం ఆగండి. ఇలా నా వెంట రండి.” అంటూ ముందుకు దారి తీసింది.

satya_4ఇద్దరూ కొద్దిసేపు నడిచి, బాగా చదును చేసివున్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతిల్తో చేసిన ఆరడుగుల శక్తివిగ్రహం ఒకటి వున్నది.

కీర్తిసేన సత్యపాలుడితో, “ఈమేను స్వయంశక్తి దేవతగా మేం ఆరాధిస్తాం. ఈ దేవత ఆశీర్వాదం వుంటే, అన్ని చిక్కులూ విడిపోతాయని, మా దృఢ విశ్వాసం!” అన్నది.

సత్యపాలుడు, స్వయంశక్తి దేవతకు భక్తీగా నమస్కరించి, రెండు మస్సాలు తర్వాత, ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి, రాజధానికి ప్రయాణమయ్యాడు.

ఆ మర్నాటి నుంచే, అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుబడ్డ ఉన్నతాధికారులు బంధింప బడ్డారు. సత్యపాలుది నాయకత్వంలో సైనికులు జట్టుజట్టుగా చీల దేశంలోని అన్ని రకాల దొంగలనూ బంధించి కారాగారంలో వేసారు.

ఇలా రెండు మాసాలు గడిచాయి. సత్యపాలుడు ముందు చెప్పినట్టే, భిల్లదేసపు పొలిమేరల్లో పురుష వేషంలో వున్న కీర్తిసేనను కలుసుకున్నాడు.

అతడు, ఆమెతో, “కీర్తిసేన! స్వయంశక్తి దేవత దయవల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి. నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా ఋణపడి వున్నాను. నాతోబాటు మా రాజ్యానికి వచ్చి, మహారాణి పదవిని అలంకరించి, నన్ను కాస్త అయిన ఋణ విముక్తుణ్ణి చేయమని కోరుతున్నాను.” అన్నాడు.

కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే, కీర్తిసేన అన్న వీరసేనుడు, అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకుని, తన చెల్లెలను వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు.

మరి కొద్ది రోజుల్లోనే కీర్తిసేనా, సత్యపాలుల వివాహం జరిగింది.

వివాహ సంరంభం ముగిసీ ముగియడంతోనే, మామగారి సైన్యాన్ని కూడా వెంట బెట్టుకుని, మహిరదేశం మీద దండెత్తాడు, సత్యపాలుడు.

satya_6యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి, సత్యపాలుడిని కలుసుకుని, “నాయనా సత్యపాలా! పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు. కాని, నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక, నీ మీద అధిమానం పెంచుకుంది. ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను.” అంటూ దీనంగా కోరాడు.

ఇందుకు సత్యపాలుడు అంగీకరించి, మదూలికను వివాహం చేసుకున్నాడు.

తర్వాత ప్రచండవర్మను తనకు సామంత రాజుగా నియమించి, కీర్తిసేనా మదూలికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, తండ్రి భోగలాలసత కారణంగా, ఆ రాజిక పరిస్థితిలో వున్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం. ఇందుకు రాజనీతి, చతురత అవసరంలేదు. పట్టుదలా, కార్యదీక్షా వుంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగాల రాజనీతి చతురత అవసరం అవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో వున్నట్టు లేదు. చంద్రపాలుడు గడ్డుసమస్యలు కల్పించినట్టుగానే, సత్యపాలుడు రాజనీతి లోపం, అతడి వారసుడికి ప్రమాదకారణం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ, మధూలిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు. తనకు తానై మదూలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించినవాడు, కీర్తిసేన విషయంలో మరొక విషంగా ప్రవర్తించాడు. పోనీ మధూలిక అహంకారి అని తిరస్కరించాదంటే, ఆమెనూ చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే, తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే, సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.

దానికి విక్రమార్కుడు, “సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుదన్న సంగతి, అతడు అధికారానికి వచ్చినప్పటినుంచీ ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. అంతరంగిక సమస్యలు కంటే, పొరుగు రాజులు సృష్ఠించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలభట్ట సలహాలు తోసి పుచ్చాడంలోనే, అతడి రాజనీతి, చతురత వెల్లడవుతున్నది. ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యంపెట్టు! అది రాజుకు స్తానబలాన్ని, అన్గాబలాన్నీ సంపాదించి పెడుతుంది. అది ఎరిగిన వాడు గనకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచాకాన్నీ అణచివేసాడు. భిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే, రాజు ప్రచందవర్మలా అదను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన, తను సత్యపాలుది పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచెందుకే, అతణ్ణి తన దేవి దగ్గరకు తీసుకు వెళ్ళింది. అందువల్లనే మదూలికను తానై కోరి వివాహమాడడానికి నిరాకరించినవాడు, ఆమెను తానై మహారానివి కమ్మని కోరాడు.

అధముల్ని అడిగి అవుననిపించుకోవడమంటే, ఉత్తముల్ని అడిగి లేదని పించుకోవడం మేలన్న సూక్తి అందరేరిగినదే. అహంకారి అయిన మధూలిక, తనకు సత్యపాలుది మీద అభిమానం వున్నా, తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే – తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి, తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో వుంది వుంటుంది. కాని, పరిస్తితుడు మరొకలా పరిణమించడంతో, తండ్రి ప్రార్తనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా, అతణ్ణి వివాహమాడవలసి వచ్చింది.

సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచీ జరిగిందంతా పరిశీలించినప్పుడు, అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక, పరిస్థితుల ప్రభావం బల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తిన్చాగల వివేకి కూడా అని తెలుస్తున్నది.” అన్నాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్ళీ చెట్టెక్కాడు.

satya_7

Source: Chandamama, August 1992.